పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ.2 చొప్పున తగ్గింపు

Mar 14,2024 23:53 #decreses, #petrol, #rates

న్యూఢిల్లీ : కోవిడ్‌ విపత్తు సమయంలోనూ ఇంధన ధరలను పదేపదే పెంచుతూ ప్రజలపై భారాలు మోపిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెట్రోలు, డీజిలు ధరలను స్వల్పంగా తగ్గించింది. పెట్రోలు, డీజిలు ధరలను లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టు చేశారు. ఈ నెల 15 ఉదయం 6 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇంధన ధరలను రూ.2 చొప్పున తగ్గించి పేదల పక్షపాతిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలిచారని ఆయన గొప్పలు చెప్పుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గినా ఆ తగ్గింపు ధరను కూడా కాజేసి పదేపదే ఇంధన ధరలు పెంచుతూ వచ్చిన మోడీ సర్కార్‌కు ఎన్నికల వేళ ఇలాంటి జిమ్మిక్కులు చేయడం పరిపాటేనని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో గురువారం సాయంత్రం నాటికి లీటరు పెట్రోల్‌ రూ.111.71, డీజిల్‌ రూ.99.51గా ఉంది. ఈ ధరలు శుక్రవారం నుంచి రూ.2 చొప్పున తగ్గనున్నాయి.

➡️