సిఎఎపై విచారణకు సుప్రీం అంగీకారం

Mar 15,2024 22:45 #against, #agree, #CAA, #Petitions, #Supreme Court

– 19న పిటిషన్లపై విచారణకు నిర్ణయం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ‘పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)’ అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆ పిటిషన్‌లపై ఈ నెల 19న విచారణ జరపనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. సిఎఎ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఆ చట్టం అమలును నిలిపివేయాలని కోరుతూ.. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ), కేరళకు చెందిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయుఎంఎల్‌) ఇటీవల అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ తదితర పొరుగు దేశాల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) కేంద్ర హోంశాఖ ఇటీవల నోటిఫై చేసింది. సిఎఎపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమైందంటూ డివైఎఫ్‌ఐ, ఐయుఎంఎల్‌ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ చట్టం అమలును నిలిపివేయాలని పిటిషన్‌లలో పేర్కొన్నాయి. అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట పిటిషన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం ‘మంగళవారం దీనిపై వాదనలు వింటాం. మొత్తం 190కి పైగా కేసులు ఉన్నాయి. అన్నింటినీ విచారిస్తాం’ అని తెలిపింది.

మరింత సమాచారం కోసం .. లింక్ పై క్లిక్ చేయగలరు..

సిఎఎ మాకొద్దు !

➡️