US bridge collapse : భారతీయుల చొరవను ప్రశంసించిన బైడెన్

Mar 27,2024 13:58 #America, #bridge, #Collapsed bridge

వాషింగ్టన్‌ : అమెరికా బాల్టిమోర్‌ నగరంలోని ఫ్రాన్సిస్‌ స్కాట్‌ వంతెన మంగళవారం కూలింది. సింగపూర్ డాలి అనే నౌక వంతెనను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారని మేరీల్యాండ్‌ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా భారీ ప్రాణ నష్టం జరగకుండా చూసినందుకు నౌకలోని భారతీయ సిబ్బందిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రశంసించారు. వంతెన కూలిపోవడం వల్ల ఆరుగురు మృతి చెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బైడెన్‌ బుధవారం వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ.. ‘తమ ఓడపై నియంత్రణ కోల్పోయామని ఓడలోని సిబ్బంది గుర్తించారు. వెంటనే మేరీల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే మేరీల్యాండ్‌ అధికారులు బ్రిడ్జిని మూసివేసి.. వాహనదారుల్ని నిలిపివేశారు. ఓడలోని సిబ్బంది అలర్ట్‌ వల్ల పెను ప్రమాదం తప్పింది. ఎంతో మంది ప్రాణాల్ని వారు కాపాడారు.’ అని ఆయన వారిని అభినందించారు. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందనడానికి కారణాలు లేవు. ఈ ఘటనలో ఎనిమిది మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ సంఖ్య మారవచ్చు కూడా. వీరిలో ఇద్దరినీ రెస్క్యూ అధికారులు రక్షించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుంది. అని బైడెన్‌ అన్నారు.

‘బాల్టిమోర్‌ నౌకాశ్రయం దేశంలో అతిపెద్ద షిప్పింగ్‌ హబ్‌లలో ఒకటి. గతేడాది ఎగుమతులు, దిగుమతుల్లో అమెరికాలో అగ్రశ్రేణిగా ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 850,000 వాహనాలు ఈ నౌకాశ్రయం గుండా వెళతాయి అని బైడెన్‌ అన్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ పోర్ట్‌ మూసివేనా.. త్వరలోనే మళ్లీ తిరిగి తెరవబడుతుందని’ బైడెన్‌ అన్నారు. వంతెన కూలిపోవడంతో నదిలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. వీరిద్దరూ నిర్మాణ కార్మికులు. వీరిలో ఒకరు శాన్‌ లూయిస్‌ పీటెన్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తి, చిక్విములలోని కామోటన్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తిగా మేరీల్యాండ్‌ అధికారులు గుర్తించినట్లు మంత్రిత్వశాఖ ధృవీకరించింది. వీరిద్దరి కుటుంబాలకు సమాచారాన్ని అందించామని అధికారులు తెలిపారు.

సింగపూర్‌ ఫ్లాగ్‌తో సరుకు రవాణా నౌక ‘డాలి’ షిప్‌లో ఉన్నది మొత్తం 22 మంది భారతీయులేనని వారంతా సురక్షితంగా ఉన్నారని షిప్పింగ్‌ కంపెనీ సినర్జీ మారిటైమ్‌ గ్రూప్‌ ప్రకటించింది.

➡️