ప్రచారానికి రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి : సిపి ఏ.రవిశంకర్

Mar 21,2024 17:24 #cp press meet, #visaka, #vizag
  • అనుమతులకు సువిధ, ఫిర్యాదులకు సి-విజిల్‌ యాప్‌లు వాడాలని సూచన

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి అని సువిధ యాప్ ద్వారా అనుమతి కోరినప్పటికీ దానిని సంబంధిత నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ద్వారానే అనుమతి ఇవ్వడం జరుగుతుందని నగర పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ తెలిపారు. గురువారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటింటి ప్రచారానికి కూడా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఇతర ఫిర్యాదుల ను సి విజిల్ యాప్ , సువిధ యాప్ , డయల్ 100, 112 ల ద్వార కానీ అలాకాని పక్షంలో నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయాలనీ వచ్చిన ఫిర్యాదులను రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలోని మొబైల్ కోడ్ కండాక్ట్ (ఎంసీసీ) బృందాలు విచారించి నివేదిక ఇచ్చిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సి విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర ఎన్నికల కమిషన్ 100 నిమిషాల డెడ్ లైన్ విధించిందని తెలిపారు. నగరంలో ఇప్పటికే 63 మొబైల్ కోడ్ కండాక్ట్ (ఎంసీసీ) బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయాలు పోలింగ్ స్టేషన్ లకు 200 మీటర్ల దూరంలో ఉండాలని ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు 5 స్టాటిక్ సర్వైలైన్ టీం (ఎస్ ఎస్ టి) టీములను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు . ఇప్పటికే ఎన్నికల భద్రత కోసం రెండు సిఐఎస్ఎఫ్, ఒక సిఆర్పిఎఫ్ బెటాలియన్ బలగాలు నగరానికి చేరుకున్నాయని అదేవిధంగా మీడియా సెల్ మోనిటరింగ్ సెంటర్ (ఎం సి ఎం సి) ద్వారా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు పోస్టులపై పూర్తి నిఘా ఉంటుందని ఏదైనా ప్రకటన కానీ లేదా పోస్ట్ గాని పెట్టేముందు దానిపై స్పష్టత ఉంటేనే పెట్టాలని లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. వ్యక్తిగత దాడులకు పాల్పడవద్దని, కుల , మత సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో 728 లైసెన్స్ కలిగిన ఆయుధాలు ఉన్నాయని వీటన్నిటిని ఆయా స్టేషన్లో డిపాజిట్ చేయడం జరిగిందని స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో పలువురు నాటు తుపాకులు కలిగి ఉన్నారని సమాచారం తమకు ఉందని వాటిని కూడా డిపాజిట్ చేస్తామని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా సి విజిల్ , డయల్ 100 , 112 లకు ఫిర్యాదు చేసేవారు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఐపిసి సెక్షన్ 182 ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రౌడీ షీటర్ల పై గత నెలరోజులుగా నిఘా పెంచడం జరిగిందని నగరవ్యాప్తంగా రౌడీషీట్లు, డెకరేట్లు, కేడీలు అనుమానితులు మొత్తం కలుపుకొని 2902 మంది ఉన్నారని, వారిలో 175 మంది ప్రస్తుత పోలీస్ శాఖకు అందుబాటులో లేరని వారిని కూడా త్వరలోనే పోలీస్ శాఖ ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు, వీరిపై ప్రత్యేక నిఘా కూడా ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు. ఎలక్షన్ విధులు నిర్వహించే పోలీసులు, ప్రత్యేక భద్రతా దళాలకు చెందిన సిబ్బంది ఐడి కార్డుల తోపాటు డ్యూటీ పాస్ లు కూడా కలిగి ఉంటారని ఎవరి మీద అయిన అనుమానం వస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కమిషనర్ ఫకిరప్ప , డిసీపి-1 మణికంఠ డిసిపి-2మూర్తి పాల్గొన్నారు.

➡️