ప్రజల అజెండా

Apr 12,2024 06:14 #Articles, #edit page, #PM Modi

దేశ ప్రజలను భావోద్వేగాల్లో ముంచెత్తి, ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని కాషాయ పరివారం ఉబలాటపడుతోంది. దానికి తగ్గట్టుగానే రామమందిరం, పౌరసత్వం వంటి మత సంబంధ అంశాలను ప్రచారంలో పెట్టటానికి తన సర్వశక్తులూ, కుయుక్తులూ ప్రయోగిస్తోంది. ప్రస్తుత బతుకుల్లో ఎలాంటి మేలునీ, మార్పునూ తేలేని గతంలోని నిర్మాణాలను, వివాదాలను చర్చలోకి తెచ్చి, ఆవేశాల చిచ్చు రగిలించాలని చూస్తోంది. అదే సమయంలో, ప్రజలు మళ్లీ మళ్లీ ఆ మాయలో పడబోరని గ్రహించడం వల్ల కాబోలు; మరోపక్క ప్రతిపక్షాల మీదికి ఇడి, సిబిఐ వంటి జేబు సంస్థలను ఉసిగొల్పి, వాటి మనోధైర్యాన్ని దెబ్బ తీయాలని బరి తెగిస్తోంది.
అయితే, మోడీ షా బృందం మాయా మంత్రాంగం మరోసారి నెరవేరే పరిస్థితి కనపడడం లేదు. గుజరాత్‌ తరహా అభివృద్ధి అంటూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఊదరగొట్టిన గాలి బుడగ కొద్ది రోజుల్లోనే పేలిపోయింది. మోడీ ఇచ్చిన ఏడాది రెండు కోట్ల ఉద్యోగాల హామీ కూడా ఉత్తుత్తిదేనని ఆచరణలో తేలిపోయింది. దాదాపు పదేళ్ల పాలనలో బిజెపి సాధించిన అభివృద్ధి ఏమిటో, ఇచ్చిన హామీల్లో నెరవేర్చింది ఎంతో దేశ ప్రజలకు వివరించి, ఓట్లు అడగటం సమంజసం. కానీ, ఆ విధంగా ముందుకు వెళ్లటానికి ముఖం చెల్లని కాషాయదళం భావావేశాలను రెచ్చగొట్టటం ద్వారానే పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. అభివృద్ధి, ఉద్యోగాల కల్పన అంటూ గత ఎన్నికల్లో తాను ఇచ్చిన వాగ్దానాలకు తానే మంగళం పాడేసి, మతపరమైన అజెండాతో మళ్లీ మోసగించటానికి మోహరిస్తోంది.
కానీ, ప్రజలు దైనందిన జీవితాల్లోంచి, తమ జీవన స్థితిగతుల్లోంచి నెమ్మది నెమ్మదిగా వాస్తవాలను గ్రహిస్తున్నారు. తాజాగా ”ది హిందూ సిఎస్‌డిఎస్‌ – లోక్‌నీతి” నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వేలో జనం మనోగతం వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిపిన ఈ సర్వేలో- ప్రజలు తమ ప్రాధాన్యాంశాలు ఏమిటో స్పష్టం చేశారు. ఉద్యోగం – ఉపాధి కల్పనó, ధరల నియంత్రణ తమ అత్యంత కీలకమైన అవసరాలని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో మూడింట రెండొంతుల మంది తమ జీవిక అవసరాలకే ప్రప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం ప్రజాకాంక్షకు అద్దం పడుతోంది. తాము ఉద్యోగం, ఉపాధి పొందటం, నిలుపుకోవడం ఈ ఐదేళ్ల కాలంలో అత్యంత కష్టంగా మారిందని అన్ని నివాసిత ప్రాంతాల్లోనూ 60 శాతానికి పైగానే జనం ఆవేదన వ్యక్తం చేయటం దేశంలోని నిరుద్యోగ తీవ్రతను చెప్పకనే చెబుతోంది. దళితులు, ఆదివాసీలు, ముస్లిముల్లో ఈ ఆక్రందన మరింత ఎక్కువగా ఉంది. బిజెపి హయాంలో అత్యంత వేగంగా అమలు చేస్తున్న ఉదార ఆర్థిక విధానాలు పేదలను మరింత పేదరికంలోకి, కార్పొరేట్లను శతాధిక కోట్ల లాభాల్లోకీ ఏవిధంగా నెడుతుందో ఈ సర్వేలో వెల్లడైన ఆవేదన ఒక సోదాహరణ.
ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, అనుభవాల ఆధారంగా ఎన్నికల్లోకి వెళితే- కమల నాధుల డొల్లతనమంతా బట్టబయలు అవుతుంది. పెద్ద నోట్ల రద్దు, కోవిడ్‌ కాలాన లాక్‌డౌన్‌, ప్రభుత్వరంగం నిర్వీర్యం, రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో పక్షపాతం, పెద్దఎత్తున పరిశ్రమల మూసివేత, ఉపాధి దిగ్గోత వంటి ముఖ్యమైన అంశాలన్నీ ముందుపీఠిన ప్రచారంలోకొస్తాయి. మోడీ పాలనలోని అప్రయోజకత్వం, అచేతనత్వం ప్రజలకు మరింత బాగా అర్థమవుతాయి. ఊకదంపుడు మాటలు తప్ప ఉద్ధరించింది ఏమీ లేదని తేటతెల్లమవుతుంది. ప్రశ్నించే గొంతుల మీద పేట్రేగుతున్న నిరంకుశం ఎంతో ప్రజల్లో చర్చకు వెళుతుంది. ఎలక్టోరల్‌ బాండ్లు తదితర పేర్లతో అడ్డగోలుగా సాగించిన ‘చందా ఇచ్చుకో- దేశాన్ని దోచుకో’ అన్న దందాతనం వెల్లడవుతుంది. వీటన్నిటి గురించి ప్రజల్లో చర్చ జరిగి, ఎన్నికల్లో ఆ చర్చ సారాంశమే ఫలితాలను నిర్ణయించగలిగితే- కాషాయ జట్టు తట్టా బుట్టా సర్దుకోవాల్సి ఉంటుంది. అందుకనే, అది దేశ ప్రజల తక్షణ అవసరాల మీద, దైనందిన జీవన పరిస్థితుల మీదా చర్చ జరగనివ్వదు. ప్రజలు తమ బతుకు గురించి ఆలోచిస్తూ ఉంటే, బిజెపి వారిని భావావేశాల మీదికి మళ్లించేందుకే మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటుంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల అజెండాకే ప్రాధాన్యం లభించేలా ప్రతిపక్షాలు ప్రయత్నించాలి. ఈ దేశ సంస్క ృతిని, సామరస్యాన్ని, ఐక్యతని, అభివృద్ధినీ కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రజల అవసరాలపైనే చర్చ జరిగేలా కృషి చేయాలి.

➡️