హిందూత్వ ప్రాతిపదికన జనాభా విధానం!

వేగంగా జనాభా పెరగడం వల్ల ఎదురయ్యే సవాళ్ళను, జనాభా మార్పులను అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఇటువంటి కమిటీ గురించి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించడం ఇక్కడ ఆసక్తి రేకెత్తించే అంశం. జనాభా పెరుగుదలపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసి దాని ఆధారంగా కొత్త జనాభా విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావించినట్లైతే, దాని గురించి ప్రస్తావన పార్లమెంట్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంలో వుండాలి.

‘వేగంగా జనాభా పెరుగుదల’ అన్న అంశమే వివాదాస్పదంగా వున్నందున ఇక ఉన్నత స్థాయి కమిటీ ప్రయోజనం కూడా అస్పష్టంగా వుంది. పైగా, జనగణన నిర్వహించనిదే, కమిటీ పరిశీలించడానికి అవసరమైన డేటా ఎక్కడ నుండి వస్తుంది?

జనాభా నియంత్రణ, విధాన రూపకల్పనకు సంబంధించి ఇటువంటి చర్య తీసుకోవడానికిగల నేపథ్యాన్ని ఇక్కడ పరిశీలించాల్సి వుంది. 2022 అక్టోబరులో విజయదశమి నాడు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రసంగిస్తూ, జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని పిలుపిచ్చారు. ఇది అందరికీ సమానంగా వర్తింప చేయాలని కూడా కోరారు. ‘మతం ప్రాతిపదికన జనాభా అసమానతల’ ముప్పుల గురించి ఆయన హెచ్చరించారు. దీనివల్ల తూర్పు తైమూర్‌, దక్షిణ సూడాన్‌, కొసావోల్లో జరిగినట్లుగా కొత్త దేశాల ఏర్పాటుకు దారి తీసే అవకాశం వుందన్నారు. ”జనాభా నియంత్రణతో పాటుగా మత ప్రాతిపదికన జనాభా సంతులత కూడా కీలకమైన అంశమే, దాన్ని ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చేయరాదు.” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. భగవత్‌ ప్రసంగాన్ని, ఆర్‌ఎస్‌ఎస్‌ తీసుకువచ్చిన ఇతర సాహిత్యాన్ని చూస్తే సరిహద్దుల ఆవల నుండి చొరబాట్ల వల్ల ఏర్పడుతున్న ‘మతపరమైన అసమానత’పై, బలవంతపు మత మార్పిడులపై ప్రతీసారీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఇదే వాదన చేేస్తోంది. 1951 నుండి 2011 మధ్య కాలంలో ‘భారతీయ మూలాలకు’ చెందిన మతాలు 88 శాతం నుండి 83.8 శాతానికి పడిపోగా ముస్లిం జనాభా మాత్రం 9.8 శాతం నుండి 14.22 శాతానినికి పెరిగిందని భగవత్‌ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

మతపరమైన మార్పిడి, చొరబాట్ల కారణంగా మతాల మధ్య అసమానత పెరిగిందని, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా వుందని, దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక గుర్తింపునకు ముప్పుగా పరిణమిస్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రమైన వాదనలు చేస్తూనే వుంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తపరుస్తున్న ఈ రకమైన ఆందోళనే…వేగంగా జనాభా పెరుగుదల, జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రకటన వెలువడడానికి దారితీసింది. అందువల్ల ఇదేమీ స్వల్పకాలిక ప్రతిపాదనలా కనిపించడం లేదు. పైగా ఈ ఉన్నత స్థాయి కమిటీలో వుండే సభ్యులెవరో చెప్పలేదు. లోక్‌సభ ఎన్నికలలోగా ఆ కమిటీ నివేదిక అందచేస్తుందని కూడా భావించడం లేదు. కాబట్టి కొత్త జనాభా నియంత్రణ విధానమనేది మోడీ మూడవ దఫా పదవీ కాలంలో అమల్లోకి తీసుకురాబోయే ప్రాజెక్టుగా వుంటుందని భావించాల్సి వుంటుంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారం చేస్తున్న మతపరమైన అసమానతలకు, ముస్లిం జనాభా వేగంగా వృద్ధి చెందుతుండడంతో నెలకొన్న భయాందోళనలకు ఎలాంటి శాస్త్రీయమైన డేటా ఆధారం లేదు. 2019-21లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, హిందూ (ఒక్కో మహిళకు 1.94 మంది పిల్లలు), ముస్లిం మహిళ (ఒక్కో మహిళకు 2.36 మంది పిల్లలు) ల్లో సంతానోత్పత్తి రేటులో తేడా కేవలం ఒక్కో మహిళకు 0.42 శాతంగా మాత్రమే వుంది. ముస్లిం మహిళల్లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతోంది. 1990-92లో మొదటిసారిగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేసినపుడు ఇది 3.39గా వుండేది. ఇప్పుడు 2.36కి పడిపోయింది. గత రెండు దశాబ్దాల్లో కనిపించిన ధోరణిని చూసినట్లైతే, హిందువుల్లో సంతానోత్పత్తి రేటు 30 శాతం మేరకు తగ్గగా, ముస్లింలలో 35 శాతం మేర తగ్గింది. వాస్తవానికి, గత 20 ఏళ్ళలో చూసినట్లైతే హిందువుల్లో కన్నా ముస్లింలలో జనాభా వృద్ధి రేటు బాగా క్షీణించింది. బహుశా 2030కల్లా హిందూ-ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేట్లు ఒకే రీతిలో వుండే అవకాశముంది.

జనాభా నియంత్రణపై బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచన, కొత్త జనాభా విధానం ఈ రెండూ పరస్పర విరుద్ధమైన ప్రేరణలను కలిగిస్తున్నాయి. ఒకవైపు, హిందూత్వవాదులు జనాభా పెరుగుదలను అరికట్టాలని కోరుకుంటున్నారు. అప్పుడే వర్ధమాన దేశం వనరులు ప్రజల అవసరాలకు సరిపోతాయని భావిస్తున్నారు. నరేంద్ర మోడీ 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేస్తూ ‘జనాభా విస్ఫోటనం’ తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, మతపరమైన అసమానతలను అరికట్టేందుకు ముస్లిం జనాభా వృద్ధి రేటును కట్టడి చేయాల్సిన అవసరం వుందంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌కు సరిహద్దుల్లో గల అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో జనాభా మార్పుల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేకంగా ఆందోళన చెందుతోంది. ఉత్తరప్రదేశ్‌లో, కొత్త జనాభా విధానానికి ముందస్తు సూచికను 2021లో ఆదిత్యనాధ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ‘జనాభా విధానం 2021-2030’ పేరుతో ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం, వివిధ కమ్యూనిటీల మధ్య జనాభా సమతూకం వుండేలా చూసేందుకు హామీ కల్పించేలా ప్రయత్నాలు చేపడతారు. ఒక్కో కుటుంబానికి ఇద్దరు పిల్లలు వుండేలా ఈ డాక్యుమెంట్‌లో కొన్ని రాయితీలు, ప్రోత్సాహకాలతో ప్యాకేజీ ప్రతిపాదించారు. ప్రభుత్వ పథకాల్లో ముస్లిం లబ్ధిదారుల విషయానికి వస్తే వీటిని ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని భావించవచ్చు. ఇక్కడ హిందూత్వ శక్తుల అసలు బాధ వేగంగా జనాభా పెరగడం గురించి కాదు. చొరబాట్లు, మత మార్పిడులను పరిశీలనలోకి తీసుకుంటే ముస్లిం జనాభా వృద్ధి రేటు అధికంగా వుందని భావించడం. అందువల్లే, హిందూత్వ ప్రాతిపదిక జనాభా విధానాన్ని రూపొందించడానికి కసరత్తు జరుగుతోందని అర్ధమవుతోంది.

ప్రతి పదేళ్ళకోసారి జరగాల్సిన జనాభా లెక్కల నిర్వహణను మోడీ ప్రభుత్వం ఎందుకు చేపట్టలేదో దీనివల్ల అర్ధమవుతోంది. 2021లోనే జనగణన జరగాల్సి వుంది. కనీసం 2022లో కోవిడ్‌ తర్వాతనైనా లేదా 2023లోనైనా చేపట్టాల్సి వుంది. పౌరసత్వ హక్కులు సంపాదించుకోకుండా, భూములు కొనుగోలు చేయకుండా చొరబాటుదారులను నిలువరించేందుకు జాతీయ పౌర రిజిస్టర్‌ను రూపొందించాలని ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి జోడీ భావిస్తోంది. జాతీయ జనాభా రిజిస్టర్‌ను ఏర్పాటు చేయడం జాతీయ పౌరుల పట్టికను ఏర్పాటు చేసే దిశగా ప్రాథమిక చర్యగా వుంది. పౌరసత్వ (సవరణ) చట్టాన్ని ఆమోదించే సమయంలో జాతీయ పౌరుల రిజిస్టర్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. 2021 జనగణనలో జాతీయ జనాభా రిజిస్టర్‌ను ఆధునీకరిస్తామని కూడా ప్రకటించింది.

అందువల్ల, తాము చెబుతున్న మతపరమైన అసమానతలను అరికట్టేందుకు కొత్త జనాభా నియంత్రణ విధానం ముసుగులో ముస్లిం జనాభాను వారు లక్ష్యంగా చేసుకుంటారు. జాతీయ జనాభా రిజిస్టర్‌, జాతీయ పౌరుల నమోదు ఆధారంగా మతపరమైన గుర్తింపుపై ఆధారపడి పౌరసత్వంపై అణచివేతలు అమలు చేస్తారు. ‘భారతీయేతర’ జనాభాను దిగ్గోయాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ పథకం పకడ్బందీగా అమలవుతుంది. బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉన్నత స్థాయి కమిటీ ప్రకటన ముసుగులో దాగిన అసలైన ఉద్దేశమిదే.

( ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం )

➡️