రైతాంగ మేధోమధనం

రేపటి నుంచి ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశం – ముస్తాబైన కర్నూలు

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : రైతాంగ మేథోమధనానికి రంగం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కుంటున్న వివిధ సమస్యలతో పాటు, దేశం ముందున్న వివిధ అంశాలను చర్చించి, కార్యాచరణను రూపొందించడానికి కర్నూలులో నేటి నుండి జరగనున్న ఎఐకెఎస్‌ జాతీయ కౌన్పిల్‌ సమావేశం వేదిక కానుంది. ప్రతిష్టాత్యకంగా జరగున్న ఈ జాతీయ కౌన్సిల్‌కు కర్నూలు నగరం ముస్తాబైంది. నగరంలోని కలెక్టరేట్‌ కూడలి, సుందరయ్య కూడలి, ఆర్‌ఎస్‌ రోడ్డు కూడలి, గాయత్రి ఎస్టేట్‌ కూడళ్లను ఎఐకెఎస్‌ తోరణాలతో ముస్తాబు చేశారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు 27 రాష్ట్రాల నుంచి 140 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఎఐకెఎస్‌ అఖిల భారత అధ్యక్షులు అశోక్‌ ధావలే, అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్‌, ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా, టి.సాగర్‌, ఆర్థిక కార్యదర్శి కృష్ణప్రసాద్‌తో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఢిల్లీ, నోయిడాలో రైతు ఉద్యమం నడిపిన నాయకులు, వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేస్తున్న ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. తొలిరోజు శుక్రవారం ఉదయం ప్రారంభ సభ, కార్యదర్శి నివేదిక, మధ్యాహ్నం కర్నూలు సుందరయ్య కూడలి నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకూ రైతు ర్యాలీ కొనసాగుతుంది. అనంతరం నాలుగు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. శనివారం, ఆదివారం కార్యదర్శి నివేదికపై చర్చలు, తీర్మానాలు కొనసాగనున్నాయి. కర్నూలు బస్టాండు సమీపంలోని సత్య ఇన్‌ హోటల్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల వేదికకు స్వాతంత్ర సమరయోధుడు, తమిళనాడు రైతు ఉద్యమ నాయకులు శంకరయ్య పేరుతో శంకరయ్య నగర్‌గా నామకరణం చేశారు. సమావేశాల నిర్వహణ కోసం 20 సబ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. మద్దతు ధరల చట్టం, విద్యుత్‌ రంగ సంస్కరణలు, సమగ్ర పంటల బీమా, రైతుల రుణమాఫీ, పౌర హక్కులు, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, ఫెడరల్‌ వ్యవస్థను రక్షించుకోవడం ప్రధాన అంశాలుగా చర్చలు సాగనున్నాయి. గురువారం సాయంత్రానికే ముఖ్య నాయకులు కర్నూలుకు చేరుకున్నారు.

➡️