ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు అత్యాచారయత్నం

Apr 17,2024 22:21

ప్రజాశక్తి-విజయనగరం కోట :   విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రిలో మంగళవారం రాత్రి ఓ ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఆర్‌ఎంఒ రాజు, వన్‌టౌన్‌ సిఐ బి.వెంకటరావు తెలిపిన వివరాలు ప్రకారం..గంట్యాడ మండలం పెంటశ్రీరాంపురానికి చెందిన గంధవరపు గోపి (33).. అనారోగ్యం పాలైన తన తల్లిని ఆస్పత్రిలో చేర్పించాడు. వారం రోజులుగా ఆసుపత్రిలోనే తన తల్లికి సహాయకుడిగా ఉంటున్నాడు. నగరంలోని లక్ష్మీ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో సెకెండ్‌ ఇయర్‌ చదువుతున్న లలితకుమారి అనే విద్యార్థిని ట్రైనింగ్‌ లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తుంది. మంగళవారం రాత్రి 8:30 గంటల సమయంలో పురుషుల వార్డులో పేషెంట్‌లకు ఇంజక్షన్‌ ఇచ్చి నరుసుల రెస్ట్‌ రూమ్‌ లో మంచినీళ్లు తాగడానికి వెళ్లింది. రెస్ట్‌ రూమ్‌ లోపల గడియ పెట్టి ఉండడంతో తలుపు కొట్టింది. అప్పటికే ఆ రూమ్‌లో ఉన్న గోపి ఆ విద్యార్థిని చేయి పట్టుకొని గది లోపలికి లాగి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఊహించని పరిణామంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇతర సిబ్బంది, సెక్యూరిటీ గార్డు నిందితుడు గోపిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అతడు కిటికీ అద్దాలు పగలగొట్టి ఫర్నిచర్‌ను చిందర వందర చేశాడు. పారిపోయే క్రమంలో ఆపరేషన్‌ థియేటర్‌ అద్దాలు పగులగొట్టాడు. గాయపడిన అతడ్ని సెక్యూరిటీ గార్డు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నిందితుడికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. పట్టుబడిన గోపి.. తన తల్లికి బాగోలేక ఆస్పత్రికి వచ్చామని, క్షమించి వదిలేయాలని సెక్యూరిటీ సిబ్బందిని వేడుకున్నాడు. మద్యం మత్తులో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వైద్యులు చెబుతున్నారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఎ.నరేష్‌ నిందితుడిపై కేసు నమోదవు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️