పనసతో పసందులు

Apr 14,2024 13:17 #ruchi, #Sneha

వేసవి వస్తుందనగానే మార్కెట్లో కొన్ని రకాల పండ్లు ప్రత్యక్షమవుతాయి. అలాంటి వాటిలో పనసపండు ఒకటి. దరిదాపుల్లో ఎక్కడ ఉన్నా దాచలేని సువాసనతో మధురిమ లలికిస్తుంది ఈ పనస. విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, ఫైటోన్యూట్రియంట్స్‌, ఐసోఫ్లేవిన్స్‌ లాంటి ఆరోగ్యకరమైన, ఔషధీయమైన లక్షణాలు పనసకున్నాయి. ఇది జీర్ణ శక్తిని మెరుగు పరచటం, రక్తపోటును తగ్గించటం, మలబద్దక నివారిణిగా, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచేదిగా సహాయపడుతుంది. మంచి ఆరోగ్యాన్నిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది. మరి ఇంత ఉపయోగకారి అయిన పనసను పండుగా తినడమే కాక మరి కొన్నిరకాల రుచులతో  చవి చూద్దాం. వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

పనసపొట్టు పికిల్‌..

కావలసినవి : పనస పొట్టు – 2 కప్పులు, పచ్చిమామిడి కాయ చిన్న ముక్కలు – 11/2 కప్పులు, పసుపు – స్పూను, కారం – కప్పు, ఉప్పు – 3/4 కప్పు, ఆవ పిండి – 1/2 కప్పు, పచ్చి మెంతి పిండి – 2 స్పూన్లు, నూనె – 2 కప్పులు

తయారీ : పనస పొట్టుకు పసుపు, ఉప్పు, కారం, నూనె కొంచెం కొంచెం కలిపి నాలుగు గంటలు ఎండలో పెట్టాలి. తర్వాత వెడల్పు గిన్నెలో పనస పొట్టు, మామిడి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ఆవ పిండి, మెంతి పిండి, నూనె అన్నింటినీ బాగా కలిపి రెండు రోజులు ఊరనివ్వాలి. మూడో రోజు పచ్చడిని ఒకసారి కలిపి శుభ్రం చేసుకున్న గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.

కుడుములు..


కావలసినవి : పనస తొనలు – 10, పచ్చికొబ్బరి తురుముా 1/2 కప్పు, బెల్లం -3/4 కప్పు, నీళ్ళు – కప్పు, పొడి బియ్యం పిండి – 3/4 కప్పు, ఉప్పు – చిటికెడు, యాలుక పొడి – 1/4 స్పూను, సొంఠి పొడి – 1/4 స్పూను, నెయ్యి – స్పూను

తయారీ : ముందుగా కొబ్బరి, పనస తొనలు విడివిడిగా మెత్తని గుజ్జులా మిక్సీ పట్టుకోవాలి. బెల్లంలో నీటిని చేర్చి వేడిచేసి కరిగించి వడకట్టాలి. బాండీలో కరిగించిన బెల్లం, ఉప్పు, సొంఠిపొడి, యాలుకపొడి, కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. ఇది మరిగేటప్పుడు పనసతొనల గుజ్జు వేసి ఉండలు లేకుండా కలపాలి. గుజ్జు కలిసిన తర్వాత నెయ్యి, బియ్యం పిండి వేసి ఇది కూడా ఉండలు లేకుండా కలపాలి. చలిమిడిలా ముద్దగా అయి బాండీ నుంచి విడిపోయేటప్పుడు స్టౌ ఆఫ్‌ చేసి కొంచెం ఆరనివ్వాలి. ఈ పిండిని పనస (మామిడి, బాదం ఏదైనా) ఆకుల్లో పెట్టి కవర్‌చేయాలి. వీటిని ఇడ్లీ పాత్రలో ఉడికించాలి. సాంప్రదాయమైన పనసతొనల కుడుములు రెడీ.

హల్వా..

కావలసినవి : పనస తొనల గుజ్జు – కప్పు, బెల్లం – 1/4 కప్పు, నెయ్యి – 2 స్పూన్లు, పచ్చికోవా – 2 స్పూన్లు, యాలుకపొడి – 1/4 స్పూను

తయారీ : బాగా పండిన పనస తొనలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లానికి కొంచెం నీటిని చేర్చి వేడిచేసి, కరిగిన బెల్లాన్ని వడకట్టాలి. బాండీలో నెయ్యి వేడిచేసి పనస గుజ్జును పచ్చివాసన పోయేవరకూ ఉడికించాలి. అంచుల వెంబడి నెయ్యి కనిపించేటప్పుడు కరిగించిన బెల్లాన్ని పోసి మరల తిప్పుతూ మీడియం ఫ్లేం మీద ఉడికించాలి. దీనికి పచ్చికోవా, యాలుకపొడి కలపాలి. హల్వా బాండీనుండి విడిపోయే వరకూ తిప్పుతూ ఉడికించి డ్రైఫ్రూట్స్‌ ముక్కలు కలిపి స్టౌ మీది నుంచి దింపేయాలి. అంతే రుచికరమైన పనస తొనల హల్వా రెడీ.

➡️