పొత్తు, తొత్తు పార్టీలను ఓడించండి

-ఈ పదేళ్లలో రాష్ట్రాభివృద్ధి వెనకబడింది
-కొకైన్‌ డ్రగ్‌ కంటైనర్‌ ఎవరిదో చెప్పాలి : వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- భీమవరం :బిజెపితో పొత్తులో ఉన్న టిడిపి, జనసేన… బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తోన్న అధికార వైసిపిని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రజలను కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బిజెపితో టిడిపి, జనసేన, వైసిపి అంటకాగడం రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని అన్నారు. బ్రెజిల్‌ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన రూ.50 వేల కోట్ల విలువైన కొకైన్‌ డ్రగ్‌ కంటైనర్‌ ఎవరిదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టిడిపిదని వైసిపి వారు, వైసిపిదని టిడిపి వారు అంటున్నారన్నారని, బిజెపి నేతలకూ సంబంధం ఉందని వార్తలు వచ్చాయని, వీరంతా కలిసి రాష్ట్రంలో డ్రగ్స్‌ను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. భీమవరంలోని సుందరయ్య భవనంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత 2004 నుంచి 2019 వరకూ రాహువు, 2019 నుంచి 2024 వరకూ కేతువులు రాష్ట్రాన్ని పాలించాయని, ఈ పదేళ్లలో రాష్ట్రాభివృద్ధి వెనుకబడిందని అన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమా రాలేదని, పరిశ్రమల పేరుతో రెండున్నర లక్షల ఎకరాల పచ్చని పొలాలు కాజేశారని వివరించారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ వారు, జగన్‌ కలిసి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు… టిడిపికి రూ.40 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్లు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ వారు ఇస్తే ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వారితో కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకోవడానికేనా? అని నిలదీశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాములో మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఉన్నారని, అటువంటి వారికి టిడిపి టికెట్‌ ఎలా ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. లిక్కర్‌ స్కాములో అవినీతికి పాల్పడిన వారి నుంచి బిజెపి వేలాది కోట్ల రూపాయలు తీసుకుని అవినీతిపరులకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. పార్టీకి ఎంత డబ్బు ఇస్తారు? ఎంత ఖర్చు పెడతారు? అనేదే ప్రధాన రాజకీయ పార్టీలు చూస్తున్నాయే తప్ప, నీతి, నిజాయతీగలవారు, ప్రజలకు సేవ చేసే నాయకులు ఆ పార్టీలకూ అవసరం లేదని అన్నారు. నరసాపురం ఎంపీ రఘురాంకృష్ణంరాజు మూడు పార్టీల నుంచి టికెట్‌ ఆశించినా రాలేదన్నారు. తనకు టికెట్‌ రాకుండా జగన్‌ అడ్డుకున్నారని ఆయన చెబుతుండడం బిజెపి, వైసిపి మధ్య లోపాయికారీ ఒప్పందాన్ని బట్టబయలు చేస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. ఇండియా వేదికలోగల పార్టీలతో రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ మధ్య సీట్ల సర్దుబాటు జరిగిందని, కాంగ్రెస్‌తో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కోగల శక్తి ఒక్క ఇండియా వేదికలోని పార్టీలకు మాత్రమే ఉందన్నారు. అసెంబ్లీలో ప్రజాగళం వినిపించాలంటే సిపిఎం అభ్యర్థులను, పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఎన్నికల సంఘం ఆంక్షలు ప్రతిపక్షాలకేనా?
ఎన్నికల సంఘం సవాలక్ష ఆంక్షలు పెట్టిందని, ఇవి ప్రతిపక్షాలకేనా? అధికార పార్టీకి వర్తించవా? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పోస్టర్లు అంటించడానికి, పార్టీ కార్యాలయాలపై జెండాలు పెట్టుకోవడానికి ఆంక్షలు పెట్టిన ఎన్నికల సంఘానికి… వేల కోట్ల రూపాయల పంపిణీకి కొన్ని పార్టీలు సిద్ధమైనా కనిపించట్లేదని విమర్శించారు. ఇప్పటికే వలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు, మహిళలకు భారీ మొత్తంలో చీరలు, గిఫ్టులు పంచారని తెలిపారు. ఎన్నికల సంఘం ఇటువంటి వాటిని నిలువరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి అందరికీ సమాన స్వేచ్ఛ ఇవ్వాలని, అధికార పార్టీల పట్ల ఒకలా, వామపక్షాల పట్ల మరోలా వ్యవహరించకూడదని అన్నారు.
సాగు, తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
పశ్చిమగోదావరి జిల్లాలో విపరీతంగా ఎండలు కాస్తున్నాయని, ఈ నేపథ్యంలో సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం కోరారు. శివారు ప్రాంత పొలాలకు సాగునీరందే పరిస్థితి లేదని, వివిధ రకాల కాలుష్యంతో తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. ఒడుదుడుకుల మధ్య ఆక్వా సాగు జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం వివిధ రకాల పరీక్షలు జరుగుతున్నాయని, ఉక్కబోతతో విద్యార్థులు, ప్రజలు అల్లాడుతున్నారని వివరించారు.కోతలు లేకుండా విద్యుత్‌ను అందించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్‌, బి.వాసుదేవరావు పాల్గొన్నారు.

➡️