ఫిబ్రవరి 20న విఎంసి వద్ద ధర్నాలో పాల్గొనండి : సిఐటియు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఫిబ్రవరి 20న విఎంసి వద్ద ధర్నాలో మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికుల పాల్గొని విజయవంతం చేయాలని అ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్మోహన్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మస్తర్ పాయింట్లలో , గాజులరేగ, హుకుంపేట, కొత్తపేట, పూల్ బాగ్, జొన్న గుడ్డిలో కార్మికులకు కరపత్ర ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు జీతం, సంక్రాంతి కానుక 1000 రూపాయలు, 2 నెలల హెల్త్ అలవేన్స్ లు 3 సంవత్సరాల సరెండర్ లీవ్ డబ్బులు, పంప్ హౌస్, లీకుల్లా పనిచేసే కార్మికులకు 2 నుంచి 6 నెలలు బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను మోసం చేస్తుందన్నారు.  సమ్మె సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన హామీల్లో భాగంగా సమ్మె కాలపు జీతం, సంక్రాంతి కానుకకు జీవోలు ఇచ్చి కూడా కార్మికులకు డబ్బులు చెల్లించలేదని, క్లీన్ ఎన్విరాన్మెంటల్ వర్కర్లకు 21000/-, డ్రైవర్లకు 24,500/- లు జీతం జీవోలు రావాల్సి ఉందన్నారు. స్థానికంగా రెండు నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు ఉన్నాయని, 2022 బట్టలు కుట్టుకూలి, 2023 లో ఇవ్వాల్సిన బట్టలు , సబ్బులు, నూనెలు,చెప్పులు నేటికీ ఇవ్వలేదు అన్నారు.నీటి సరఫరా విభాగంలో పంప్ హౌస్, లీకుల్లో పనిచేస్తున్న కార్మికులకు రెండు నెలల నుంచి ఆరు నెలలు జీతాలు బకాయిలు ఉన్నాయని, జీతం ఇవ్వకుంటే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ఆప్కాస్ లో లేని కార్మికులకు తరుడు పార్టీ విధానాన్ని రద్దు చేసి నగరపాలక సంస్థ ద్వారానే నేరుగా జీతాలు ప్రతినెల 7వ తేదీ లోపు చెల్లించాలని, విలీన ప్రాంత కార్మికులకు ఈఎస్ఐ,పిఎఫ్ అమలు చేయాలని , ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్, సెమిస్కేల్ వేతనాలు అమల కోసం రీజనల్ డైరెక్టర్ కి ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జరిగే ధర్నాలో కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కరపత్ర ప్రచారంలో రామారావు, ఆదినారాయణ, రమణ, కృష్ణ ,బాబురావు, శివ తదితరులు పాల్గొన్నారు.

➡️