రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం 

parliamentary committee on child rights

 

బాల కార్మికుల పథకాల విలీనంపై పార్లమెంటరీ కమిటీ నివేదిక

న్యూఢిల్లీ : వెట్టిచాకిరీ చేస్తున్న బాల కార్మికులకు విముక్తి కలిగించి వారికి పునరావాసం కల్పించేందుకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాన్ని 2021లో విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఓ పథకంలో విలీనం చేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తప్పుపట్టింది. విలీనంపై రాష్ట్రాలను సంప్రదించకపోవడంతో వాటిపై ఆర్థిక భారం పెరిగిందని తెలిపింది. విలీనం చేసిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. విలీన ప్రక్రియ క్షేత్ర స్థాయిలో గందరగోళానికి తావిచ్చిందని, ఫలితంగా జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్‌ (ఎన్‌సిఎల్‌పి) అమలు పేలవంగా ఉన్నదని ‘బాల కార్మికులపై జాతీయ విధానం : ఓ అంచనా’ పేరిట స్టాండింగ్‌ కమిటీ రూపొందించిన నివేదిక వివరించింది. బాల కార్మికులను గుర్తించడం, వారిని రక్షించడం, పాఠశాలలకు పంపడం ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశం. విలీనానికి ముందు అంటే 2017-18లో ఈ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చుతో పోలిస్తే విలీనం తర్వాత 2020-21, 2022-23లో పెట్టిన వ్యయం ఐదో వంతు కూడా లేదని నివేదిక ఎత్తిచూపింది. కోవిడ్‌ సమయంలో…అంటే 2021-22లో పెట్టిన ఖర్చులో కూడా సగం కంటే తక్కువేనని తెలిపింది. కార్మిక, విద్యా శాఖల మధ్య సమన్వయం లేకపోవడం పథకం అమలుకు శాపంగా మారిందని వ్యాఖ్యానించింది.

➡️