నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

Jan 31,2024 08:00 #Minister Prahlad Joshi, #speech
  • ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌ ఎత్తివేత : మంత్రి ప్రహ్లాద్‌ జోషి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. గురువారం మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడతారు. మొదటి రెండు రోజుల తరువాత, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానంపై ఉభయ సభల్లో చర్చలు ప్రారంభమవుతాయి. ఆ తరువాత బడ్జెట్‌పై చర్చలు జరుగుతాయి. ఇది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ అవుతుంది. ఫిబ్రవరి 9న ఈ సెషన్‌ ముగుస్తుంది.ఎంపిల సస్పెన్షన్‌ ఎత్తివేతప్రివిలేజ్‌ కమిటీకి సూచించిన 14 మంది ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. అఖిలపక్ష సమావేశ అనంతరం మీడియాతో ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఎంపిల సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష సభ్యులందరి సస్పెన్షన్‌లను ఉపసంహరించుకోవాలని కోరుతూ.. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన ప్రివిలేజెస్‌ కమిటీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిందని చెప్పారు. నిర్మాణాత్మక చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే ఎంపిల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కోరామని చెప్పారు. బడ్జెట్‌ సెషన్‌ సమర్థవంతంగా సాగడంలో పార్లమెంటు సభ్యుల మధ్య చర్చలు, సహకారం ప్రధానమని తెలిపారు. ఈ సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.

➡️