పేరెంట్సే రోల్‌మోడల్స్‌..

Apr 14,2024 12:34 #parents, #Sneha

పిల్లలకు ముందు పరిచయం అయ్యేది తల్లిదండ్రులే.. ఆ తర్వాత అనుకరించేది.. అనుసరించేది అమ్మానాన్నల్నే.. వాళ్లు రోజు మొత్తంలో ఎక్కువసేపు తల్లిదండ్రులతోనే ఉంటారు. దానివల్ల తల్లిదండ్రుల ప్రభావమే పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు రోల్‌ మోడల్స్‌ కావాలి అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏది ఆశిస్తున్నారో.. అది ముందు వారు ఆచరించాలి అంటున్నారు. అందానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తుంటే.. అదే పిల్లలపైనా ప్రభావం చూపిస్తుంది. పుస్తకాలు చదవడం వంటి లక్షణం పేరెంట్స్‌కు ఉంటే పిల్లలూ అదే అందిపుచ్చుకుంటారు. అందుకే సరైన దృక్పథంతో తల్లిదండ్రులు ఉండాలి.. అదే అసలైన పేరెంటింగ్‌ అనేది నిపుణుల మాట.

పిల్లలు విజువల్‌గా చూసినవే ఆకళింపు చేసుకుంటారు. ఎవరేదైనా చేస్తే అలాగే చేయాలని అనుకుంటారు. ఏదైనా కొత్తగా వింటే అది అనడానికి పదే పదే ప్రయత్నిస్తారు. అలాగే పిల్లలు ఎవరైనా హేళన చేస్తుంటే ముద్దుగా అనిపించి ప్రోత్సహిస్తుంటాం.. అమ్మనాన్న ఫేస్‌కి క్రీమ్స్‌ రాసుకుంటే.. మాటలు రాని చిన్నది కూడా తనూ రాసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అలాగే పిల్లల్ని అందంగా ముస్తాబు చేయడానికి చూపినంత శ్రద్ధ.. ఆరోగ్యంగా ఉండడానికి చూపాలనేది నిపుణుల మాట.

వర్ణ వివక్ష..
పిల్లలవి పసి మనసులు.. చిన్న విషయాన్నీ.. కాస్త మందలింపునీ స్వీకరించలేరు. అందుకే పిల్లల్ని కించపరిచే మాటలు అనొద్దనేది నిపుణుల మాట. లావుగా ఉంటే హేళనగా బండోడా.. బండదానా.. అనే మాటలు తల్లిదండ్రులే అంటే.. ఇంక ఆ పిల్లలు బయటవాళ్లు అనే మాటలతో ఎంతటా కుంగిపోతారో ఆలోచించాలి అంటున్నారు. అలాగే కొందరి పిల్లల కళ్లు చిన్నవిగా ఉంటాయి.. కనుగుడ్డు రంగుల్లో మార్పుంటుంది. లేకపోతే ఏదైనా సమస్య ఉంటుంది. అలాగే నడకలో తేడా ఉంటుంది.. అలాగే మాటలు తత్తరపాటుగా.. ఒక అక్షరానికి ఒకటి మాట్లాడుతూ.. అర్థాలు మారేలా మాట్లాడతారు.. ఇక రంగులో తేడాలు.. కొందరు పిల్లలు రంగులో కాస్త తక్కువో, నలుపో ఉంటారు. ఇలా వాళ్లకున్న లోపాల్ని పదే పదే ఎత్తిచూపుతూ.. వ్యంగపు మాటలతో చిన్నబుచ్చకండి. ఆ మాటలు ఆ చిన్నారులను మానసికమైన కుంగుబాటుకు గురిచేస్తాయి.. అది వాళ్ల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి అంటున్నారు నిపుణులు. పిల్లలకు ఇలాంటివి తల్లిదండ్రులు గుర్తించినప్పుడు.. వాటిని ఎలా ప్రతికూలంగా మలచుకోవాలో, అసలైన అందం అదే అని చెప్పేలా ఉండాలి. అది వారికి పది ఏనుగుల బలాన్ని ఇస్తుంది. అయినా వాళ్లూ కుంగిపోతున్నట్లు ఉంటే.. స్ఫూర్తిదాయకమైన కథలు చెప్పాలి. వాళ్ల లోపాల్ని అధిగమించేందుకు తల్లిదండ్రులే కొండంత ధైర్యాన్ని, చేయూతను ఇవ్వాలి.


పౌష్టికాహారం తీసుకునేలా..
ఏ లోపమైన పౌష్టికాహారం అందకపోతేనే. అలాగే అందాన్ని చూసే కన్నులను బట్టి ఉంటుంది. అన్నింటికన్నా.. మనిషి ఆరోగ్యంగా ఉండడం కీలకం.. అందం అనేది ఆరోగ్యం వల్లే అనే వాస్తవాన్ని ముందు తల్లిదండ్రులే గ్రహించాలి అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రుల జీవనశైలి పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. ఉదయం లేవడం దగ్గర నుంచి, నడక, ఆహారం తీసుకునే విధానం, సమయం.. పడుకునే వరకూ పెద్దలు ఏమి చేస్తే పిల్లలూ అదే ఫాలో అవుతుంటారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారం, పప్పుధాన్యాలు అన్నీ ఆహారంలో భాగస్వామ్యం అయ్యేలా చూడాల్సింది పేరెంట్సే. అలా అన్నీ అందేలా ప్రణాళికబద్ధంగా ఉండాలి. తల్లిదండ్రులు తినేదాన్నీ పిల్లలు గమనిస్తుంటారు. అందుకే తల్లితండ్రుల నుంచే ఆ మార్పు రావాలి. అన్నీ తినడానికి తయారుకావాలి.

మంచి అలవాట్లు..
పిల్లలు సమయపాలన పాటించాలి అంటే.. ముందు తల్లిదండ్రులు ఆచరించాలి. అప్పుడే పిల్లలకూ క్రమశిక్షణ అలవడుతుంది. సమయానికి నిద్ర లేవడం దగ్గర నుంచి, చదువు, తిండి విషయంలో, రాత్రి నిద్ర పోయే వరకూ ఒక పద్ధతిని అనుసరిస్తారు. ఇది వారు పెద్దయ్యే వరకూ ప్రభావం చూపిస్తుంది. వారు తమ పిల్లల్నీ అదేవిధంగా తీర్చిదిద్దగలుగుతారు. ఉదయం వ్యాయామం చేయడం.. చిన్నపాటి నడకో, శారీరక శ్రమ కలిగేలా ఆటలో, డ్యాన్సో చేసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. అలాగే సహాయం చేసే గుణం కూడా తల్లిదండ్రుల నుంచే అలవడుతుందని నిపుణులు చెప్తున్నారు. పుస్తకాలు చదవడం, పాటలు వినడమో, పాడటమో, ఎదుటివారితో మంచిగా వ్యవహరించడం, పిచ్చి మాటలు, బూతులు అనకుండా ఉండటం ఇవన్నీ తల్లిదండ్రుల నుంచే పిల్లలకీ అలవడే లక్షణాలు. అందుకే పేరెంట్స్‌ రోల్‌ మోడల్స్‌గా ఉండాలి అనేది నిపుణులు చెప్పే మాట. అలాగే బయట కూడా ఇలాంటి వాటికి ప్రభావితులవుతారు. అది గమనించిన తల్లిదండ్రులు వెంటనే తప్పొప్పులు చెప్పాలి. చిన్నోళ్లు అన్నప్పుడు ముద్దుగానే అనిపిస్తుంది కానీ, అది తప్పనే అవగాహన కలిగించకపోతే.. ముదుర్లు అవుతారు.. చెడ్డవారిగా తయారవుతారని చెప్తున్నారు నిపుణులు.

➡️