మాటల మూటలు

Apr 7,2024 05:29 #Editorial

మాటలను ఆచితూచి మాట్లాడటంలో నేర్పు, నిజాయితీ కావాలి. ముఖ్యంగా అర్థజ్ఞానం, శబ్దజ్ఞానం కావాలి. ఈ దృష్టితోనే పూర్వమో పండితుడు తన కొడుకుతో ‘యద్యపి బహునా ధీషే తథాపి పఠపుత్ర! వ్యాకారణమ్‌, స్వగణ్ణ శ్వగణో మాభూత్‌’ అన్నాడట. అంటే… అనేక విషయాలు సరిగా తెలుసుకోవాలంటే వ్యాకరణం నేర్చుకొమ్మన్నాడు. దీనిలో ‘స్వగణం’ అంటే మనవాళ్లు, బంధువులు. ‘శ్వగణం’ అంటే కుక్కల గుంపు అని అర్థం. ఉచ్ఛారణ భేదంవల్ల, రాయడంలోని పొరబాటు వల్ల అర్థాలు మారిపోతాయి. మచ్చుకు ‘పలనాటి వీరచరిత్ర’లో ‘జననితో సమమైన జంతువులేదు’ అంటాడు బాలచంద్రుడు. ఆశుకవిత్వంలో యతికోసం తల్లిని జంతువన్నాడు. వేదాంతుల దృష్టిలో మనమంతా పశువులమే కావొచ్చు. లేదా శివుడొక్కడే పశుపతి కావొచ్చు. అంతమాత్రాన ఈ ప్రయోగం బాగుందనగలమా? మన ఆలోచనలున్నంత స్పష్టంగా మాటలూ వాటి అర్థాలూ వుంటేనే ఎదుటివ్యక్తికి మన భావాలు తెలుస్తాయి. సగటు మనిషికీ… కవులు, రచయితలకు మధ్య గల భేదాన్ని వారి భాషను బట్టి, వాటి అర్థాల స్పష్టతను బట్టి గుర్తించవచ్చు. కానీ, మన రాజకీయ నాయకులు ఉపన్యాసాల్లో చెప్పే మాటలకు అర్థాలు ఏ డిక్షనరీల్లోనూ దొరకవు. వాటికి పర్యాయపదాలూ వుండవు. సామాన్యులకు మాటలు, సంపన్నులకు మూటలు కట్టబెట్టడం మన పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. ‘ఎన్ని ఓట్లు వచ్చాయన్నదే లెక్కకాని, ఎంత సారా ఖర్చయిందన్నది లెక్క కాదే’ అంటారు రావిశాస్త్రి. ఏదోవిధంగా అధికారం దక్కించుకోడమే వారి లక్ష్యం.
ఎన్నికల్లో ప్రజలకు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి, ఎన్నికల తర్వాత గాలికొదిలేసిన అనేక రాజకీయ పార్టీలను చూస్తున్నాం. ఎన్ని వాగ్దానాలు చేసినా… వాటికి చట్టబద్దత వుండదు కనుక ఇబ్బడిముబ్బడిగా వాగ్దానాలు చేస్తూనే వుంటారు. ‘ఎన్నికలలో ఎన్ని కలలో?/ ఒక్క చేపకై ఎన్ని వలలో’ అని బాపురెడ్డి అన్నట్టుగా… మాటలతో, ప్రలోభాలతో మభ్యపెడుతూనే వుంటారు. ప్రతి రాజకీయపక్షానికి తన సిద్ధాంతాలకు అనుగుణమైన లక్ష్యాలు వుంటాయి. ఆ లక్ష్యసాధనకు ఉపకరించే కార్యక్రమాలను రూపొందించుకుంటారు. వాటిని ప్రజలకు వివరించి, అధికారం ఇమ్మని కోరుకుంటారు. అధికారంలోకి వస్తే… తమ వాగ్దానాలన్నీ అమలు చేస్తామని అలవిగాని హామీలిస్తారు. ఆ తర్వాత చెత్తబుట్టలో పడేస్తారు. ‘చెప్పేదొకటి/ చేసేదొకటి కారాదోరు/ మాటల మనిషివే కాకోరు/ చేతల మనిషివి కావోరు’ అంటాడో కవి. దేశంలోని అనేక రాష్ట్రాలలో పాలక పార్టీలన్నీ తమ మ్యానిఫెస్టోలను పథకాల చుట్టూనే తిప్పుతున్నాయి. బిజెపి మరో రెండడుగులు ముందుకేసి ఒక చంకలో కార్పొరేట్‌ శక్తులను, మరో చంకలో మతాన్ని అంటిపెట్టుకొని భారత్‌ వెలిగిపోతోందంటూ ప్రచారం చేస్తోంది. మరోవైపు సంక్షేమ పథకాల పట్ల తన వ్యతిరేకతను బాహాటంగానే ప్రదర్శిస్తోంది. ‘మాన్పగలిగితి కత్తికోతలు,/ మాన్ప వశమే, మాట కోతలు?/ కత్తి చంపును, మాట వాతలు/ మాన వేనాడున్‌’ అంటారు గురజాడ. మాటలు మూటలు గాలిలో కలిసిపోగా, ప్రపంచ ఆకలి సూచీలో, నిరుద్యోగం వంటి అనేక విషయాల్లో భారత్‌ అథమ స్థానంలో వుందని లెక్కలు చెబుతున్నాయి. మట్టిగుర్రాన్ని నమ్ముకుని ఏట్లోకి దిగిన చందంగా మారింది దేశం పరిస్థితి.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడంలేదు. మ్యానిఫెస్టోలు ఒట్టి కాగితాలుగానే మిగిలిపోతున్నాయి. అందుకే, రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలకు ఆయా పార్టీలు జవాబుదారీగా వుండాలి. నిబద్దత కలిగిన సిపిఐ(ఎం) వంటి రాజకీయ పార్టీలు తమ విధానాన్ని బాహాటంగానే చెబుతారు. అధికారంలోకొచ్చిన తర్వాత ఆచరించి చూపుతారు. అలాంటి చిత్తశుద్ది రాజకీయ నేతలకు అవసరం. ‘వట్టి మాటలు కట్టి పెట్టి/ గట్టి మేల్‌ తలపెట్టవోయ్’ అని గురజాడ అన్నట్టుగా ప్రతి రాజకీయ పార్టీ, నాయకుడు ఒట్టి మాటలను కట్టి పెట్టి ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. ‘ఐక్యం అదీ వ్యవస్థ/ అప్పుడుండదు మనకీ అవస్థ/ అనేకం అయితే ఏకం/ అదే వివేకం’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. కార్పొరేట్‌- మతతత్వ కూటమిని మట్టిగరిపించేందుకు వివిధ లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఒకతాటిపైకి రావడం అవసరం. ప్రజానుకూల విధానాలకు, మతసామరస్యానికి ఒక ఆశాకిరణంలా నిలిచిన కేరళ ఈ దేశానికి ఆదర్శం కావాలి.

➡️