అక్రమార్కులు!

ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. జిల్లా జీవనాడైన పెన్నా నదిలో నీటి వనరుల జాడ తగ్గడం ఇసుకాసురులకు వరంగా మారింది. ఫలితంగా పర్యావరణ అనుమతులు లేని ఇసుక క్వారీల నుంచి సైతం ఇసుక అక్రమ రవాణా సాగు తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలకు సమీపంలోని పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు ఎదురు లేకుండా పోయింది. వేసవి సీజన్‌ కావడంతో భవన నిర్మాణ పనులు ఊపందుకోవడంతో ఇసుక అక్రమ రవాణాకు హద్దు లేకుండా పోయింది. నాలుగేళ్లుగా ఇసుక అక్రమ రవాణాకు హద్దు లేకుండా పోతోంది. తాజాగా మరోసారి వేసవి సీజన్‌ రావడం, పెన్నానదిలో నీటి వనరులు అడుగంటిన నేపథ్యంలో ఇసుకాసురులు దోపిడీకి లాకులెత్తారు. మూడేళ్ల కిందట అన్నమయ్య రిజర్వాయర్‌ కట్టకొట్టుకుపోవడానికి ఇసుక మాఫియాయే కారణమనే ఆరోపణలు ఉవ్వెత్తిన ఎగిసిన సంగతి తెలిసిందే. తాజాగా సిద్ధవటం మండలంలోని కమ్మపాలెంలో నిల్వ చేసిన ఇసుక డంప్‌ నుంచి భారీగా తరలిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒంటిమిట్ట పెన్నా తీరం నుంచి జంగాలపల్లి మీదుగా ఇసుక తరలిస్తుండడంపై గ్రామీణులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఇదేతరహాలో ప్రతి ఏటా ఇసుక అక్రమ రవాణా సాగిపోతోంది. ఇసుక క్వారీల్లో సైతం ప్రభుత్వం నిర్దేశిత పారామీటర్ల ప్రకారం ఇసుకను తవ్వాల్సి ఉండగా, ఇష్టానుసారంగా జెసిబిల సహాయంతో తవ్వుకోవడం కనిపిస్తోంది. దీనిపై మైనింగ్‌ అధికారులను ఆరా తీస్తే నీళ్లు నములు తుండడం గమనార్హం. అక్రమ రవాణాను ఆపడానికి సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేని దుస్థితికి జారి పోవడం ఆందోళనకరం. అక్రమార్కుల స్వార్థానికి భవిష్యత్‌ తరాలను బలిపెట్టడం శ్రేయస్కరం కాదని పలువురు మేధావులు, రిటైర్డు జడ్జిలు మొదలుకుని ఇంటలెక్షువల్స్‌ వాపోతున్నప్పటికీ పాలకుల్లో చలనం లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇసుక అక్రమ రవాణా విషయంలో పాలక, ప్రతిపక్ష పార్టీల నాయకులు కుమ్మక్కై ప్రకృతి సంపదను ఇష్టానుసారగా దోచుకోవడం హేయనీయం. అక్రమార్కులు చెన్నరు, బెంగళూరు నగరాలకు ఇసుకను తరలిస్తున్నారు. మెట్రోపాలిటన్‌ నగరాల్లో పెద్దపెద్ద డంప్‌లను ఏర్పాటు చేసి, ఒక్కో టిప్పర్‌ను సుమారు రూ.50 వేల చొప్పున బహిరంగంగానే విక్రయాలు సాగించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజూ రాత్రివేళల్లో వందలాది టిప్పర్లలో చెన్నరు, బెంగళూరుతోపాటు సరిహద్దు జిల్లాలైన కర్నూలు, అనంతపురం పట్టణాలకు ఇసుకను తరలిస్తూ కోట్లాది రూపాయల్ని దోచుకుంటున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా బంగారంతో సమానమైన ఇసుక వనరుల్ని పద్ధతి ప్రకారం ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️