జమ్ము కాశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు నిర్వహించండి : లోక్‌సభలో ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ :   త్వరలో జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మంగళవారం ‘జమ్ముకాశ్మీర్‌ స్థానిక సంస్థల చట్టాల (సవరణ) బిల్‌, 2024’పై చర్చ నిర్వహించారు. ఈ బిల్లు కేంద్రపాలిత ప్రాంతంలోని ఇతర వెనుకబడిన తరగతులకు (ఒబిసి)లకు న్యాయం చేకూరుస్తుందని బిజెపి సభ్యుడు జుగల్‌ కిషోర్‌ శర్మ పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంత పంచాయితీ, మునిసిపాలిటీల్లో ఒబిసిలకు రిజర్వేషన్‌ కల్పించే నిబంధన లేదని బిల్లుపై చర్చకు ఆహ్వానిస్తూ హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్  పేర్కొన్నారు. ఈ బిల్లు ఒబిసిలకు పూర్తి న్యాయం చేకూరుస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతంలో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్‌సి నేత హస్నైన్‌ మసూది డిమాండ్‌ చేశారు.  తమ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోనుందని ప్రధాని మోడీ సోమవారం లోక్‌సభలో ప్రకటించారని, అటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకముందే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సి వుందని అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఎలక్షన్‌ కమిషన్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్‌సిపి నేత సుప్రియాసూలే, టిఎంసి ఎంపి సౌగత్‌ రాయ్‌లు  కూడా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

➡️