ఉల్లి రైతుకు ధరాఘాతం 

Feb 15,2024 08:23 #onion, #Stories
Onion is a price hit for the farmer
  • ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు 
  • వ్యాపారుల సిండికేట్‌ 
  • భారీగా పడిపోయిన ధర

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉల్లిని పండించే రైతులకు ధరాఘాతం తప్పడం లేదు. ఉల్లి ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం, వ్యాపారులు సిండికేట్‌ కావడంతో ధరలు బాగా పడిపోవడంతో నష్టాలను మూటగట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి సాధారణ సాగు 38,707 ఎకరాలు కాగా, గతేడాది 59,160 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య 42,162కు తగ్గింది. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడకపోవడంతో ఉల్లి సాగు ఆలస్యమైంది. ఫలితంగా పంట కూడా ఆలస్యంగా మార్కెట్‌కు వస్తోంది. మార్కెట్‌కు వచ్చే పంట తక్కువగా ఉన్నా, రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. పంటను నష్టానికే రైతులు విక్రయించుకోవాల్సి వస్తోంది. ఎకరం విస్తీర్ణంలో ఉల్లి సాగుకు రూ.80 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. విత్తనాలకు రూ.10 వేలు, రసాయనిక ఎరువులకు రూ.17 వేలు, సేద్యానికి రూ.4 వేలు, కలుపు తీయడానికి రూ.15 వేలు, క్రిమిసంహారక మందులకు రూ.20 వేలు, కోతలకు రూ.10 వేల వరకూ ఖర్చవుతోంది. మార్కెట్‌కు తీసుకొచ్చే సరికి గరిష్టంగా క్వింటాలు రూ.వెయ్యి మాత్రమే పలుకుతోంది. ఆ లెక్కన కిలోకు రూ.10 కూడా రావడం లేదు. క్వింటాలుకు కనీసం రూ.2 వేలు పలికితే ఖర్చుకు తగ్గట్లు ధర వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ 12,456 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు వచ్చింది. క్వింటాలు ఉల్లి కనిష్టంగా రూ.415, గరిష్టంగా రూ.1089, మధ్యస్థంగా రూ.1039 పలికింది. ఎక్కువ మంది రైతులకు రూ.500 నుంచి రూ.800 మాత్రమే వచ్చింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో 220 మంది లైసెన్డ్‌ వ్యాపారులు ఉన్నారు. వారిలో 30 మంది ఉల్లి క్రయవిక్రయాలు సాగిస్తుంటారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. తాము కొన్న సరుకును పెద్ద వ్యాపారులకు విక్రయింటారు. అక్కడి నుంచి బహిరంగ మార్కెట్‌లోకి వచ్చేలోపు ఉల్లి ధర అమాంతం పెరిగిపోతోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.30 పలుకుతోంది. మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలానికి తోడు ప్రస్తుతం ఎగుమతులు నిలిచిపోయాయి. మన దేశం నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్తాన్‌కు ఉల్లి ఎగుమతి అయ్యేది. ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో, ఉల్లిని కొనేందుకు వ్యాపారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉల్లికి గిట్టుబాటు ధర ప్రకటించడం లేదు. ఇవన్నీ రైతుల నష్టాలకు కారణం అవుతున్నాయి.

పెట్టుబడి కూడా రాలేదు

నేను రెండు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాను. ఎకరాకు రూ.80 వేల చొప్పున రూ.1.60 లక్షలు ఖర్చు అయింది. 88 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో క్వింటాలు రూ.1080 పలికింది. మొత్తంగా రూ.95 వేలు వచ్చింది. పెట్టుబడి కూడా రాలేదు.

– మధు, బోగోలు, వెల్దుర్తి మండలం

నష్టాలే మిగిలాయి

నేను అర ఎకరంలో ఉల్లి పంట వేశాను. మొత్తంగా రూ.50 వేలు పెట్టుబడి అయింది. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాలుకు రూ.756 ధర పలికింది. ఆ లెక్కన రూ.22 వేలు మాత్రమే వచ్చింది. నష్టాలే మిగిలాయి.

– ఆనంద్‌, ఎనగండ్ల, సి.బెళగల్‌ మండలం

గిట్టుబాటు ధర కల్పించాలి

వ్యాపారులు సిండికేటై రైతులను దగా చేస్తున్నారు. దీనికి తోడు ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వం వ్యాపారుల సిండికేట్‌ను అరికట్టాలి. ఎగుమతులకు అవకాశం కల్పించాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.

– జి.రామకృష్ణ, ఎపి రైతు సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి

సిండికేట్‌ చేయడానికి లేదు

ఈ నామ్‌ విధానంలో ఎక్కడా సిండికేట్‌ చేయడానికి ఆస్కారం లేదు. సీక్రెట్‌ బిడ్డింగ్‌ చేస్తారు కాబట్టి ఒకరు వేసిన ధర ఇతరులకు తెలిసే అవకాశం లేదు. సిండికేట్‌ అయినట్లు మా దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కరిస్తాం.

– గోవిందు, కార్యదర్శి, కర్నూలు మార్కెట్‌ కమిటీ

 

➡️