కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

Dec 14,2023 00:02

ప్రజాశక్తి – బాపట్ల
అంగన్వాడీల సమ్మె బుధవారం రెండో రోజుకు చేరింది. అంగన్వాడీ కేంద్రాలు మూత పడ్డాయి. తమ కోర్కెలు తీరేవరకు పోరుబాట తప్పదని అంగన్వాడీలు భీష్మించుకుని కూర్చున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పడటంతో గర్భిణీలు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం సకాలంలో అందడం లేదని వారిలో ఆందోళన వ్యక్తమౌతోంది. తమ కోరికలు తీరేవరకు తమ కోరికలు తీరేవరకు సమ్మె విరమించేది లేదని విక్రమార్కుల్లా అంగన్వాడీలు ఐసిడిఎస్ ప్రాజెక్టు కేంద్రంవద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఫైర్ ఆఫీసు, టీ టైం, పాత బస్టాండ్, తాసిల్దార్ కార్యాలయం ద్వారా అంగన్వాడీలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ఎలిజిబెత్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ నాయకత్వం వహించారు.


కారంచేడు : అంగన్వాడీల నిరవధిక సమ్మె సందర్భంగా కారంచేడు మండల కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వినతిపత్రం అంగన్వాడి కార్యకర్తలు అందజేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ ఇవ్వాలని, అంగన్వాడి సెంటర్లకు నాణ్యమైన పౌష్టికాహార సరుకులు సరఫరా చేయాలని, ప్రమోషన్లకు వయోపరిమితి సడలించాలని, అంగన్వాడీల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని సిఐటియు జిల్లా నాయకులు పి కొండయ్య కోరారు. కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు పి అనిత, శ్రీలక్ష్మి, మేరీ, మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు.


సంతమాగులూరు : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె రెండవ రోజు సంతమాగులూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులను కలిసి తమ సమస్యలను విన్నవిస్తూ భిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు టి సింగరకొండ మాట్లాడుతూ కార్యకర్తలు గొంతెమ్మ కోరికలు కోరుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన మాట అమలు చేయడంలేదని అన్నారు. మాట తప్పం, మడిమ తిప్పం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి నాగమణి, ఎస్‌కె మస్తాన్ బి, బి నాగమల్లేశ్వరి, ఎస్తేరురాణి, శ్రీదేవి పాల్గొన్నారు.


కొల్లూరు : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ మండలంలో బుధవారం నిరవధిక సమ్మె చేశారు. అంగన్వాడీల శిబిరంను సందర్శించి కృష్ణ పశ్చిమ డెల్టా మాజీ చైర్మన్, టిడిపి మండల అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ, సిపిఎం మండల నాయకులు బొనిగల సుబ్బారావు మద్దతు ప్రకటించారు.


రేపల్లె : అంగనవాడీ కార్యకర్తలు రెండో రోజు సమ్మె కొనసాగించారు. సమ్మెకు టిడిపి నాయకులు అనగాని శివప్రసాద్, జనసేన పట్టణ అద్యక్షుడు అర్ మహేష్, ఆదర్శ వేదిక కన్వీనర్ వై కిషోర్ మద్దతు తెలిపారు. అంగనవాడీ కార్యకర్తలు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ యూనియన్ సీఐటీయు జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ, రేపల్లె ప్రాజెక్ట్ కార్యదర్శి కె వాణి మాట్లాడుతూ న్యాయమై సమస్యలు పరిష్కారం కోసం తాము సమ్మెలోకి వస్తే చర్చలకు రమ్మని సమ్మె విరమించకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడాన్ని ఖండించారు. అంగన్వాడీల సమ్మె వల్ల రాష్ట్రంలో లక్ష మంది మహిళలు రోడ్డున పడితే సమస్య గురించి మాట్లాడకుండా అధికారులు, ప్రభుత్వం గతంలో జీతాలు పెంచినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమది సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకొంటునా మహిళల సంక్షేమాన్ని పక్కన పడేసిందని ఆరోపించారు. వెంటనే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ను చర్చలకు పిలిచి పరిష్కరించాలని కోరారు. ప్రదర్శనలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎన్ కృష్ణకుమారి, డి జ్యోతి, ఎస్ నిర్మల, జ్యోతి, రజిని, విజయలక్ష్మి, సిఐటియూ, టిడిపి, జనసేన నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు కెవి లక్ష్మణరావు, డి శ్రీనివాసరావు, కె ఆశీర్వాదం పాల్గొన్నారు.


నగరం : స్థానిక తహశీసిల్దారు కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో అంగనవాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దారు ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షలు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని గతంలో అనేక దఫాలు వేడుకున్నప్పటికీ పరిష్కరించకపోగా అరెస్టులు చేసి నిర్బంధాన్ని ప్రయోగించారని అన్నారు. ఈ నేపథ్యంలో సమ్మెచేయటం తప్ప లేదన్నారు. యాప్‌లు, సర్వేలు, రకరకాల పేరుతో పని వత్తిడి పెంచారని అన్నారు. రోజువారీ ధరలు పెరుగుతున్నా వేతనాలు పెరగడంలేదని అన్నారు. తెలంగాణా కన్నా రూ.వెయ్యి ఎక్కవ ఇస్తామన్నా హామీ అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, నాణ్యమైన ఫుడ్ సరఫరా చేయటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సిఐటియు మండలం నాయకులు కె రత్నకుమారి, ఎస్ రాజ్యలక్ష్మి, నలిని పాల్గొన్నారు.


అద్దంకి : స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు యూటీఎఫ్ మండలం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇట్టా రామారావు, బేతాళ పూర్ణచంద్రరావు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జగన్నాధం బాబురావు బుధవారం మద్దతు ప్రకటించారు. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారానికి వచ్చిన వెంటనే తెలంగాణ కన్నా రూ.వెయ్యి అదనంగా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ హామీ నెరవేర్చలేదని అన్నారు. మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, గ్రాడ్యుటీ రూ.5లక్షలు ఇవ్వాలని, రిటైర్మెంట్ వయస్సు 62సంవత్సరాలకు పెంచాలని, యాప్ భారం తీసేయాలని కోరారు. కార్యక్రమంలో గంగాధర్, కృష్ణారావు, బివి రత్నం పాల్గొన్నారు.


పంగులూరు : అంగన్వాడీల సమ్మెకు సిపిఎం నాయకులు రాయిని వినోద్ బాబు సంఘీబావం ప్రకటించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై చేపట్టిన నిరవధిక సమ్మె పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీలు స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ సెంటర్‌ వరకు ర్యాలి నిర్వహించారు. బస్టాండు సెంటర్లో మానవహారం నిర్వహించి బిక్షాటన చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుడిపాటి మల్లారెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


చీరాల : అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు ప్రాజెక్టు నాయకురాలు పిప్రమీల, జి సుజీవన అధ్యక్షత వహించారు. అంగనవాడి యూనియన్ జిల్లా కార్యదర్శి పి రేఖ ఎలిజిబెత్ మాట్లాడారు. సమ్మె నోటీసు ఇచ్చి 20రోజులైనా ప్రభుత్వం చర్చలు జరపలేదని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్ బాబురావు పాల్గొన్నారు.


నిజాంపట్నం : అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంగన్వాడి యూనియన్ పల్లపట్ల ప్రాజెక్ట్ అధ్యక్షురాలు వై మేరీమణి, సిఐటియు మండల నాయకులు ఎన్ శివశంకర్ డిమాండ్ చేశారు. స్థానిక తాహాశాల్దారు కార్యాలయం వద్ద సమ్మె సందర్భంగా ధర్నా శిబిరం నిర్వహించారు. తహాశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్, సిఐటియు నాయకులు బేబీ రాణి, ఉష, దిల్షాద్, గాయత్రి, రాజేశ్వరి పాల్గొన్నారు.


భట్టిప్రోలు : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేశారు. సమ్మెకు రైతు సంఘం నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మురుగుడు సత్యనారాయణ, చేనేత కార్మిక సంఘం నాయకులు దీపాల సత్యనారాయణ, కౌలు రైతు సంఘం నాయకులు జి నాగరాజు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల కార్యదర్శి రమాదేవి, భద్రకాళి, రత్నకుమారి, రూప, భట్టిప్రోలు, వెల్లటూరు, పల్లికోన సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.


భట్టిప్రోలు (చుండూరు) : అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని రెండవ రోజు చుండూరు తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకులు బి అగస్టీన్ మాట్లాడుతూ అంగన్వాడీలకు సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి రైతు సంఘం నాయకులు మద్దతును ప్రకటించారు.


పర్చూరు : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని అంగనవాడీ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కార్యదర్శి రాణి ఎలిజిబెత్‌ కోరారు. స్థానిక తహశీల్ధారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు మాట్లాడారు. తహశీల్ధారు కార్యాలయం నుండి బొమ్మల సెంటర్‌ వరకు మార్టూరు, పర్చూరు, యద్దనపూడి మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలి నిర్వహించారు. కార్యక్రమంలో ఎం డేవిడ్‌, ప్రాజెక్ట్‌ అధ్యక్షులు ఐ వెంకటలక్ష్మి, కార్యదర్శి టి రాణి, టి జోస్న, పి శ్యామల, పి విజయలక్ష్మి పాల్గొన్నారు.


చెరుకుపల్లి : స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మనిలాల్, కె శరత్ మాట్లాడారు. తహశీల్దారుకు వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రం చేయాల్సి వుంటుందని హెచ్చరించారు.


మెదరమెట్ల : రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం ఆంజనేయులు అన్నారు. రెండో రోజు సమ్మె సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ మండల నాయకురాలు చైతన్య, సిఐటియు బాధ్యులు వై రవీంద్రబాబు అనంతరం ఎంపిడిఒ డి సురేష్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు.


ఇంకొల్లు రూరల్‌ : స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు రెండోవ రోజు నిరవధిక సమ్మె చేశారు. సిఐటియు మండల కార్యదర్శి నాగండ్ల వెంకట్రావు మాట్లాడుతూ ఈనెల 11న రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి ఒక్క డిమాండ్‌కు కూడా సమాధానం చెప్పకపోగా బెదిరింపులకు పూనుకుందని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సరళ, లత, శ్రీదేవి, రాజ్యలక్ష్మి, లక్ష్మీ, కుమారి, జ్యోతి, భారతి, పద్మావతి, ఉషారాణి, దేవమ్మ పాల్గొన్నారు.

➡️