ఒకరి వెంట ఒకరు

  • బాబు, పవన్‌, జగన్‌ ఢిల్లీ యాత్ర
  • బిజెపి అగ్రనేతల ప్రసన్నం కోసం పాట్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రానికి చెందిన మూడు పార్టీల అగ్రనేతలు మూడు రోజుల వ్యవధిలో ఒకరి తరువాత మరొకరు ఢిల్లీ యాత్ర చేపట్టారు. తొలుత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డాను కలిసేందుకు ఢిల్లి వెళ్లారు. ఢిల్లీ చేరిన వెంటనే వీరిద్దరితో వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తుపై చర్చించి హైదరాబాద్‌కు పయనమయ్యారు. గురువారం ఉదయం పవన్‌కల్యాణ్‌ బిజెపి నేతలను కలిసేందుకు ఢిల్లీ పయనమయ్యారు. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేనతో కలిసి బిజెపి పొత్తు అంశాన్ని చర్చించేందుకు వెళ్లారు. అయితే బిజెపి 20, జనసేనకు 30 సీట్లు కేటాయించాలని బిజెపి అగ్రనాయకులు చంద్రబాబుకు సూచించినట్టు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌కు కూడా వారు ఇదే రీతిలో దిశానిర్ధేశం చేశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తద్వారా ఎన్నికల అనంతరం క్రియాశీలకంగా వ్యవహరించాలని జనసేనకు బిజెపి నాయకత్వం సూచించిందన్న సమాచారంతో టిడిపి నాయకుల్లో కలవరం ప్రారంభమైంది. బిజెపితో పొత్తు వల్ల వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు టిడిపికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని టిడిపిలోని సీనియర్లు మదన పడుతున్నారు. బిజెపితో పొత్తు వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ అన్న భావన టిడిపి నాయకులు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. అయినా కేంద్రం మద్దతు లేకపోతే గెలవలేమనే భావన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లో ఎక్కువగా ఉండటం వల్ల పొత్తులు అనివార్యంగా కన్పిస్తోంది. మరోవైపు వీరి పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు సిఎం జగన్‌ కూడా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబు కాంగ్రెస్‌ నేతలకు టచ్‌లో ఉంటున్నారని, కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు సహకరించారని సిఎం జగన్‌.. ప్రధాని మోడీ, అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ప్రచారం జరుగుతోంది. గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సిఎం జగన్‌ శుక్రవారం ప్రధాని మోడీ, అమిత్‌ షాను కలవనున్నట్టు వైసిపి వర్గాలు తెలిపాయి. ప్రధానికి రాష్ట్ర సమస్యలను నివేదిస్తారని పైకి చెబుతున్నా రాజకీయ అంశాలపైనే ఆయన చర్చించనున్నట్టు తెలిసింది.

➡️