21న ‘ఉక్కు’ గర్జన సభ

  •  విశాఖ స్టీల్‌ పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలూ స్పష్టమైన ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ నెల 21న కూర్మన్నపాలెం కూడలిలోని ఉక్కు పరిరక్షణ దీక్షా శిబిరం వద్ద స్టీల్‌ప్లాంట్‌ గర్జన సభ నిర్వహిస్తామని ప్రకటించింది. సోమవారం విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు సిహెచ్‌.నర్సింగరావు, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌ మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ను వంద శాతం అమ్మాలని కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 21న నిర్ణయం ప్రకటించిన నుంచి కార్మికులు, ప్రజలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, 1,159 రోజులకు ఉక్కు పరిరక్షణ దీక్షలు చేరుకున్నాయని తెలిపారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని పోరాట కమిటీ అడ్డుకుందని అన్నారు. ప్లాంట్‌లో ఒక్క శాతం వాటా కూడా అమ్మకుండా ఆపగలిగామని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కూడా గౌరవించకుండా ప్లాంట్‌ను అమ్మేస్తామని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రకటించిందని విమర్శించారు. ఈ క్రమంలో తలపెట్టిన ఉక్కు పరిరక్షణ పోరాటానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలిపారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మాలనే వినాశకర నిర్ణయాన్ని నేటికీ కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోలేదని చెప్పారు. జిందాల్‌, టాటా వంటి కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు చేస్తూ, స్టీల్‌ప్లాంట్‌ను ఇబ్బందుల పాలు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందన్నారు. ప్లాంట్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తి చేయకుండా ఉత్పత్తిని కుదించి భారీ నష్టాల్లోకి నెడుతున్నారని తెలిపారు. నేటికీ సొంత గనులు సమకూర్చలేదని, సెయిల్‌లో విలీనం చెయ్యాలనే డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని గుర్తు చేశారు. ఐదు వేల పర్మినెంట్‌ ఖాళీలను భర్తీ చెయ్యకుండా కార్మికులపై పని భారం పెంచుతున్నారని తెలిపారు. పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ వర్కర్లకు, ఆఫీసర్లకు వేతన ఒప్పందాలు చేయకుండా ఉన్న హక్కులను హరిస్తూ ఉద్యోగులతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో మరలా అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంట్‌పై దాడి తీవ్రతరమవుతుందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అమ్మేయాలనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఓటుతో తిప్పికొట్టి బిజెపికి సరైన గుణపాఠం చెప్పాలని కార్మిక వర్గానికి, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పోరాట కమిటీ సభ్యులు వై.మస్తానప్ప, నీరుకొండ రామచంద్రరావు, వరసాల శ్రీనివాసరావు, జిఎస్‌డి.ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️