రైతు సమస్యలపై 16న నిరసన దీక్ష

Feb 8,2024 23:11

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతుల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 16న జరిగే రైతు కార్మిక సంఘాల నిరసన దీక్షను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా నాయకులు కందిమళ్ల రామకోటేశ్వరరావు కోరారు. రైతు సంఘం నాయకులు ఎనికపాటి రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పంట రుణాలను మాఫీ చేయాలనే డిమాండ్లతో అనేక ఒడిడుకులు ఎదుర్కొంటు దేశవ్యాప్తంగా రైతు సంఘాలతో గడిచిన సంవత్సరం నుండి పోరాటం చేస్తుంటే రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ నేటి వరకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదని అన్నారు. రైతులను దారుణంగా మోసం చేసాడని ఆరోపించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తీసుకున్న వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని అన్నారు. సాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు, రైతు సంఘం నాయకులు వీరవల్లి కృష్ణమూర్తి, బొడెంపూడి సూరిబాబు, మోహనరావు, శేషాద్రి పాల్గొన్నారు.

➡️