నెలరోజుల్లోనే మారిన అంకెలు

Feb 4,2024 09:06 #changed, #Numbers, #within months
  • వృద్ధి లెక్కలు తారుమారు
  • ప్రణాళిక శాఖ మరో నివేదిక

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో వృద్ధి, జిఎస్‌డిపి వంటి కీలక అంశాలపై ప్రణాళిక శాఖ తీరు విస్మయపరుస్తోంది. నెల రోజుల క్రితం భారీ వృద్ధిని చూపించి అందర్నీ విస్మయపరిచిన ఆ శాఖ తాజాగా దానికి భిన్నమైన నివేదికను రూపొందింది. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు సైతం ఈ పరిణామం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వార్షిక బడ్జెట్‌ కోసం జనవరి మధ్య కాలంలో ప్రణాళిక శాఖ జిఎస్‌డిపి, జివిఏ, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధిపై నివేదికలు సిద్ధం చేసింది. ఇందులో గణనీయంగా వృద్ధి నమోదైనట్లు చూపించింది. అది వివాదాస్పదం కావడంతో తాజాగా మరో నివేదికను సిద్ధం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశాలపై జనవరిలో వెల్లడించిన తొలి నివేదికలో అన్ని రంగాల్లోనూ మెరుగైన వృద్ధి నమోదైనట్లు ప్రకటించగా, ఫిబ్రవరిలో వెల్లడించిన నివేదికలో మూడు రంగాల్లో వృద్ధి తగ్గినట్లు పేర్కొన్నారు. చివరకు జిఎస్‌డిపి కూడా తగ్గినట్లు చూపించారు. తొలి నివేదికలో 13.17 లక్షల కోట్ల రూపాయలుగా జిఎస్‌డిపి ఉన్నట్లు పేర్కొనగా, దానిని తాజా నివేదికలో 13.03 లక్షల కోట్లకు తగ్గించి చూపించారు. అయితే కొత్త నివేదికలో 2023-24 వృద్ధిని కూడా అదనంగా పొందుపరుస్తూ 14,39,674 కోట్లు జిఎస్ డిపి రికార్డయిరదని వెల్లడించడం విశేషం. ఇదే సమయంలో గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌ (జివిఏ) మాత్రం తొలి నివేదికకన్నా పెరిగినట్లు చూపించారు. తొలుత 12.15 లక్షల కోట్లు జివిఏగా ఖరారు చేయగా, తాజాగా దానిని 12.24 లక్షల కోట్లుగా తేల్చారు. వ్యవసాయం తగ్గింది. మూడు కీలక రంగాల్లో ఒకటైన వ్యవసాయంలో విలువ తగ్గినట్లు చూపించడం గమనార్హం. తొలి నివేదికలో 4,39,645 కోట్లుగా ఉన్న విలువను తాజా నివేదికలో 4,27,961 కోట్లుగా చూపించారు. . అంటే కొద్ది రోజుల్లోనే 11,684 కోట్ల విలువ తగ్గినట్లు చూపించడం విశేషం. ఇదే సమయంలో మరో కీలకపైన సేవా రంగంలో కూడా తగ్గుదలను చూపించడం విశేషం. తొలి నివేదికలో 4.91 లక్షల కోట్లుగా చూపించిన అధికారులు తాజా నివేదికలో మాత్రం 4.80 లక్షల కోట్లుగానే తగ్గించి చూపించారు. అయితే పారిశ్రామిక రంగంలో మాత్రం ప్రగతి భారీగా పెరిగినట్లు మార్చి చూపించారు. తొలి నివేదిక కన్నా 31 వేల కోట్ల వరకు విలువ పెరిగినట్లు చూపించడం విశేషం.

➡️