రేషన్‌ షాపుల్లో మోడీ పోస్టర్లా… కుదరదు : కేరళ సిఎం విజయన్‌

Feb 13,2024 08:42 #kerala, #Pinarayi Vijayan

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళలోని రేషన్‌ షాపుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు సరి కాదని, వీటి అమలు కష్టమని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, కేరళలో ప్రజాపంపిణీ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం సొంత ప్రచారం కోసం దీనిని వాడుకోవాలని చూడడం అభ్యంతరకరమని అన్నారు.. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద పనిచేస్తున్న రేషన్‌ పంపిణీ వ్యవస్థను ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలి చూడడం సరికాదన్నారు. ఇదే విషయాన్ని తమ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుందని అన్నారు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లే విషయం పరిశీలిస్తామని అన్నారు.రేషన్‌ షాపుల్లో 14 వేలకు పైగా ప్రధాని మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని, ఆహారోత్పత్తులతో కూడిన క్యారీ బ్యాగ్‌లపై కేంద్ర ప్రభుత్వం లోగోలను ముద్రించాలని ఎఫ్‌సిఐతోపాటు కేరళ ఆహార శాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి జిఆర్‌ అనిల్‌ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 550 రేషన్‌ షాపుల్లో ప్రధాన మంత్రి సెల్ఫీ పాయింట్లను నెలకొల్పాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి తెలిపారు.

➡️