ఒమర్‌ అబ్దుల్లా పర్యటనను అడ్డుకున్న పోలీసులు

not-allowed-to-attend-rajouri-rally-escorted-like-criminal-to-my-office-omar

జమ్ము : నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) నాయకులు ఒమర్‌ అబ్దుల్లా మంగళవారం రాజౌరి జిల్లాలోని సుందర్‌బని ప్రాంతంలో పర్యటించకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. జమ్ములోని ఆయన ఇంటికి కూడా పోలీసులు తాళాలు వేశారు. పార్టీ కార్యాలయానికి వెళుతున్న అబ్దుల్లాను పోలీసులు వెంబండించారు. దీనిపై ఒమర్‌ అబ్దుల్లా స్పందిస్తూ పోలీసులు అడ్డుకోవడం ఇదే తొలిసారి కాదని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి అడ్డంకులు మరింత ఎక్కువ అవుతాయని ఆయన చెప్పారు. శాంతిభద్రతల పరిస్థితిని సాకుగా చూపి బుధవారం ఉదయం నుంచి తమ నివాసానికి తాళాలు వేశారని ఆయన చెప్పారు. తాను పార్టీ కార్యాలయానికి వెళ్లే వరకూ నేరస్థుడిని వెంబడించినట్టుగా సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి (ఎస్‌డిపిఒ) తన వెంట వచ్చారని, ఇలా రావడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌లో ప్రజాస్వామ్యానికి మనుగడ లేదనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని బయటకు చెబుతున్నా..వాస్తవానికి బిజెపి నేతలకు, వారికి వంతపాడే నేతలకు మాత్రమే ఇక్కడ రాజకీయ స్వేచ్ఛ ఉందని ఒమర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

➡️