దళిత మహిళ చైర్‌పర్సన్‌ కావడం వల్లే అవిశ్వాస తీర్మానం: శ్రీరాములు

సూర్యాపేట : 70 సంవత్సరాల సూర్యాపేట మున్సిపల్‌ చరిత్రలో ఒక జనరల్‌ స్థానంలో దళిత మహిళను మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా నియమించారు. కానీ, నేడు అధికార పక్షం పన్నాగాలు పన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను పీఠం పైనుంచి దించేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని టీఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు తప్పెట్ల శ్రీరాములు మాదిగ అన్నారు.సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ గురువారం బాబు జగ్జీవన్‌ రావ్‌ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించి మాట్లాడారు. నాలుగేళ్ల పరిపాలనలో చైర్‌ పర్సన్‌ అన్నపూర్ణ చేసిన అవినీతి ఏమిటో చేయని అభివృద్ధి ఏందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామాలు కలిసినప్పటికీ ఏ ఒక్క వార్డును నిర్లక్ష్యం చేయలేదు.అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసిన ఘనత అన్నపూర్ణకే దక్కుతుందన్నారు.అలాంటి అన్నపూర్ణను చైర్‌ పర్సన్‌ పదవి నుంచి దింపేయాలనుకోవడం అనాలోచితం అన్నారు. అగ్ర వర్ణాలతో కలసి అధికారపక్షం ఆడించే కుట్రలో కౌన్సిలర్లు బలి కావద్దని అన్నారు. అవిశ్వాసాన్ని వెనక్కు తీసుకొని పక్షంలో టీఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ప్రతి కౌన్సిలర్‌ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

➡️