పారిశుద్ధ్య కార్మికుల అలవెన్సులపట్ల నిర్లక్ష్యం

Feb 2,2024 22:42

ప్రజాశక్తి – భట్టిప్రోలు
పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు రెండు రోజులు పని చేయకపోతేనే గ్రామం మొత్తం దుర్భరమవుతుంది. గ్రామంలో పేరుకుపోయిన చెత్త, చెదారిన్ని తొలగించడంతోపాటు మురుగు కాలవల్లో పూడికతీత చేపడుతూ దుర్వాసనను చవిచూస్తూ ఉంటారు. అలాంటి వారికి ప్రభుత్వం నెల నెలా సక్రమంగా వేతనాలు అందించడంతోపాటు వారికి అవసరమైన సబ్బులు, కొబ్బరినూనె, గ్లౌజులు, మాస్కులు, వివిధ రకాల అవసరతలతో పాటు ప్రతి ఏట యూనిఫామ్ దుస్తులు కూడా అందించాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా భట్టిప్రోలు పంచాయతీలో గడచిన మూడేళ్లుగా ఇప్పటివరకు ఎలాంటి ఆలయన్స్‌లు అందించిన దాఖలాలు లేవు. గత మూడు రోజుల క్రితం అందజేసిన యూనిఫామ్ కూడా చిరిగిపోయి సొంత బట్టలతో విధులకు రావాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. మురుగు కూపంలో పనిచేసి ఇంటికి వెళ్లి భోజనం చేయడానికి కూడా చేతులు దుర్వాసనతో భోజనం చేయలేకపోతున్నామని వాపోయారు. అధికారులను ఎన్నిసార్లు విన్నవించినా అలవెన్స్ పట్ల పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. పాలకవర్గ సభ్యులు, పాలనాధికారి, సర్పంచ్ సైతం కార్మికుల పట్ల నిర్లక్ష్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా పంచాయతీలు ఇలాంటి అలవెన్స్‌లను పంచాయితీ నిధుల నుండి అందించాల్సి ఉంది. కానీ పాలకవర్గం పంచాయతీ అధికారులు వారి జేబులో సొమ్ము తీసి ఇచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేజర్ పంచాయతీగా ఉన్న భట్టిప్రోలులో సుమారు 30మంది వరకు కార్మికులు వివిధ రకాల పనిచేస్తుంటారు. ఈపాటికే అనేకమార్లు పండుగ సమయాల్లో కూడా అలవెన్స్‌లు అందుతాయని ఆశించినప్పటికీ నిరాశ ఎదురైందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి పారిశుద్ధ్య కార్మికులకు అందించాల్సిన వేతనాలు, రాయితీలను ఇప్పించాలని కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈపాటికే రెండు, మూడు పర్యాయాలు పారిశుద్య కార్మికులకు అందించాల్సిన అలవెన్సులను అందించేందుకు బోర్డు మీటింగ్లో కూడా తీర్మానం చేసినట్లు తెలిపారు. సాంకేతిక కారణాలతో జాప్యం జరిగిందని అన్నారు. త్వరలో పాలకవర్గ సమన్వయంతో కార్మికుల ఆలవెన్సులు అందజేస్తామని అన్నారు.

➡️