సైన్స్ తోనే దేశ అభివృద్ధి సాధ్యం

Feb 25,2024 17:48 #Kakinada

ప్రజాశక్తి కాకినాడ : సైన్స్ తోనే దేశాభివృద్ధి సాధ్యమని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అలపాటి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, వి.బి.వి.ఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవన్ని పురస్కరించుకుని ఆదివారం వివేకానంద పార్కు నందు గల శాఖ గ్రంధాలయం నందు జిల్లా స్థాయి లో విజ్ఞాన శాస్త్రం పై క్విజ్ పోటీలను, కాంతి పాఠ్యాంశం పై సైన్స్ ప్రయోగాలపై శిక్షణను ఇవ్వటం జరిగింది. జిల్లాలో 28 పాఠశాల నుంచి 146 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రనికి ముఖ్య అతిథి గా విచ్చేసిన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అలపాటి శ్రీనివాస్ మాట్లడుతు సైన్స్ తోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు. ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధికి సైన్స్ సహకరిస్తుందన్నారు. ప్రకృతిలో అపారమైన వనరులు ఉన్నాయని ఆ వనరుల వినియోగానికి సైన్స్ సహకరిస్తుందని తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పరిశోధన పట్ల ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. విశ్రాంత స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ దొమ్మేటి సుధాకర్ మాట్లాడుతూ మూఢ నమ్మకాలు లేని ప్రపంచాన్ని నిర్మించాలన్నారు. శాఖా గ్రంధాలయం పరిపాలనాధికారి ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ శాస్త్ర పరిశోధనలు సామాజిక అభివృద్ది కి తోడ్పడతాయని తెలిపారు. క్విజ్ పోటిలలో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, పిల్లి గోవిందరాజులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సైన్స్ ప్రయోగాలపై శిక్షణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సాంకేతిక మండలి జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్, పాఠ్యపుస్తక రచయిత కె. వెంకట్రావు కాంతి పాఠ్యాంశం పై చేసిన ప్రయోగాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. 32 ప్రయోగాలను చేసి చూపించారు. సమతలం, కుంభాకార, పుటాకార తలాలపై కాంతి పరావర్తనం సంబంధించిన వివిధ ప్రయోగాలు, పరావర్తనాలలో రకాలను తెలిపే కృత్యం, గాజు దిమ్మ లో కాంతి వక్రీభవనం ప్రయోగం, కటకాలలో రకాలను వివరించే కృత్యం, కుంభాకార, పుటాకార కటకాలలో కాంతి ఎలా ప్రయాణిస్తుందో వివరించు కృత్యం, కుంభాకార కటకానికి వస్తువు వివిధ దూరాలలో ఉన్నపుడు ప్రతిబింబాలు ఎక్కడ ఏర్పడాతాయి, వాటి స్థానాలు, లక్షణాలు తెలిపే కృత్యం, మానవుని కన్నులో కటకం, రెటీనా పనితీరు వివరించు కృత్యం, హ్రస్వ దృష్టి కంటి దోషంలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, దానికి నివారణ వంటి ప్రయోగాలను చేసి చూపించారు.

➡️