నరేంద్ర జాలం!

Mar 12,2024 06:18 #edite page, #PM Modi

అదొక పెద్ద ఆడిటోరియం.. జనంతో కిక్కిరిసింది. చిన్నారుల నుంచి పండు ముదుసలి వరకూ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుందా! అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ఆడిటోరియంలో లైట్లన్నీ ఆగిపోయాయి. చిమ్మచీకటి. ఇంతలో… ఒక్కసారిగా కలకలం. ఆ గాఢాంధకారంలో… వేల పాములు బుసలు కొడుతున్నాయి. పడగెత్తి కాటేయడానికి సిద్ధమవుతున్నాయి. జనం కేకలు. ఎక్కడికి వెళ్లాలో తెలీక అంతా ఆందోళనగా తాము కూర్చున్న కుర్చీలపైకి ఎక్కారు. ఇంతలో ఒక్కసారిగా బుసలు కొట్టే సర్ప రాజాల స్థానంలో రెడ్‌ కార్పెట్‌. దాని నిండా అందంగా పరుచుకున్న గులాబీ పూల రేకులు. హమ్మయ్య! అనుకుని ఆనందంగా కుర్చీల పైనుంచి కిందికి దిగారు. పై నుంచి 500 నోట్ల వర్షం కురుస్తోంది. అందుకునేందుకు ఆత్రంగా చేతులు పైకెత్తారు. అంతలోనే ఒక్కసారిగా ఊబిలో కూరుకుపోతున్నారు. పై నుంచి నిప్పుల వాన మొదలైంది. జనం హాహాకారాలు మిన్నంటాయి. ఇంతలోనే వేగంగా వచ్చిన వేల అనకొండలు.. ఒక్కొక్కటీ ఒక్కొక్కరినీ చుట్టేసి మింగేయడానికి ఆత్రంగా తెరిచిన నోరు… మరోవైపు దూసుకొస్తున్న మదగజాల గుంపు.
ఇంతలో ఆడిటోరియం అంతా వెలుగులు విరజిమ్మాయి.. ఇంతవరకూ గుండె ఆగిపోతుందా! అన్నంత ఆందోళనపడిన జనమంతా..ఇదంతా ఇంద్రజాల ప్రదర్శన అని గుర్తొచ్చి స్థిమితపడ్డారు. కరతాళ ధ్వనులతో తమను ఆశ్చర్యపరిచే అద్భుత ప్రదర్శన ఇచ్చిన ప్రపంచ ప్రఖ్యాత భారత మెజీషియన్లందరికీ అభినందనలు తెలిపారు. ఈ ప్రదర్శన తిలకించేందుకు ప్రపంచ నలుమూలల నుంచీ విచ్చేసిన మెజీషియన్లు… అత్యద్భుతంగా మైమరిపించిన భారత మెజీషియన్లను చూసి కుళ్లుకున్నారు.
ఇంతలో భారతదేశ అతి పెద్ద మెజీషియన్‌ …మాటల మాంత్రికుడు.. నరేంద్ర బాహుబలి వేదికపైకి వచ్చారు. ‘మోదానీ … మోదానీ’…నినాదాలు మిన్నంటు తున్నాయి.
ఆత్రం పట్టలేక..అమెరికా నుంచి వచ్చిన ఓ మెజీషియన్‌..ఇండియా మెజీషియన్‌ని అడిగాడు..’ఏమిటింత కోలాహలం…నినాదాలు…’ అని. భారత మెజీషియన్‌ చెప్పడం మొదలెట్టాడు…
”మీ మెజీషియన్లంతా ఒక గంట..లేకుంటే ఒక పూట..ఇంద్రజాల ప్రదర్శన చేస్తారు..పాతికేళ్లుగా… గుజరాత్‌లో మొదలుపెట్టి…ఇండియా అంతటా మేజిక్‌ చేస్తూ..ఎప్పుడేం జరుగుతుందో …అంతుపట్టని విధంగా ఇంద్రజాలం ప్రదర్శిస్తున్న మెజీషియన్‌ను చూసి జనం మైమరిచి చప్పట్లు కొడుతున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ పాఠాలన్నీ ఔపాసనపట్టి, వారి డైరెక్షన్‌కు అనుగుణంగా మైండ్‌ గేమ్‌ ఆడటంలో నరేంద్ర బాహుబలికి సాటి మరొకరు లేరు. గోద్రా అల్లర్లతో ఊచకోత కోసి… మత ఉద్ధారకుడుగా ముద్రవేసుకుని, గుజరాత్‌లో నేటికీ మనువాద పాలనను కొనసాగిస్తున్నాడు. 2014లో…ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు…విదేశాల్లో ఉన్న నల్ల ధనమంతా దేశంలోకి….ప్రతి భారతీయుడి ఖాతాలోకి రూ.15 లక్షలు జమ…ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా…విభజన హామీల అమలు…2019లో…దేశం కోసం…జవాన్ల కోసం..మరో అవకాశం ఇవ్వండి… రైతన్నల ఆదాయం రెండింతలు చేస్తా… ఆత్మనిర్భర్‌ భారత్‌…అంతా స్వదేశీ…2024లో..ఆర్టికల్‌ 370 రద్దు చేశాను కాబట్టి 370 సీట్లలో గెలిపించండి… మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లపైనే ఇవ్వండి… ‘ అని చెప్తుండగానే… ‘ఇచ్చిన హామీలన్నీ అమలయ్యాయా…!’ అనడిగాడు అమెరికన్‌ మెజీషియన్‌ ఆత్రం పట్టలేక.
‘అమలుజేస్తే నరేంద్రజాలం ఎలా అవుతుంది..!’ అంటూ తిరిగి చెప్పసాగాడు.
‘ఉపాధి హామీ చిక్కి శల్యమైంది. వ్యవసాయ కార్మికుడు మరింత బక్కచిక్కాడు. వ్యవసాయం గిట్టుబాటుకాక రైతన్న ఉసురుతీసుకుంటున్నాడు. కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలను భరించలేక ఉద్యమించిన రైతన్న నల్ల చట్టాలను రద్దు చేయించాడు. కానీ, కనీస మద్దతు ధర లాంటి సమస్యలు వెంటాడుతూనే ఉండటంతో… ఢిల్లీ సాక్షిగా గళం విప్పుతూ సర్కారు క్రూరత్వం కింద నలిగిపోతున్నాడు. అగ్నివీర్‌ పేరుతో జవాన్లు నాలుగేళ్ల కాంట్రాక్టు ఉద్యోగులయ్యారు. కోవిడ్‌ మహమ్మారి కొన్ని లక్షల ప్రాణాలను బలిగొన్నా… పళ్లేలు మోగించండి.. దీపాలు వెలిగించండి…అంటూ మెస్మరైజ్‌ చేశాడు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు కొలువుదీరిన మణిపూర్‌లో ఆడబిడ్డలను నగంగా నడిరోడ్డుపై నడిపించిన వారికి వత్తాసు పలుకుతూ…నేటికీ ఆ రాష్ట్రం వంక కూడా చూడలేదు… పైగా 140 కోట్ల మందీ నా బిడ్డలు అంటూ కనికట్టు చేస్తున్నాడు. నోరెత్తిన ప్రతిపక్షాలను, బుద్ధిజీవులను ‘ఉపా’ కేసులు పెట్టి, దర్యాప్తు సంస్థలతో దండ యాత్రలు చేయించి, జైళ్లలో పెట్టిస్తున్నాడు. గోమాత అంటూ దళితులు, ముస్లిములపై దాడులకు పాల్పడుతూ.. బీఫ్‌ ఎగుమతుల్లో రెండో స్థానానికి దేశాన్ని తీసుకెళ్లాడు.
పైగా 370 సీట్లంటూ ప్రతిపక్షాలతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాడు. దక్షిణాదిన 128 స్థానాల్లో 20 వస్తే గొప్పే. మిగిలిన 415 స్థానాల్లో 355 స్థానాలు సొంతంగా సాధిస్తానంటూ….గోడీ మీడియాతో గోబెల్స్‌ను మించిపోయేలా ప్రచారం చేయిస్తున్నాడు. నితీష్‌కుమార్‌, చంద్రబాబు లాంటి వాళ్లు రంగులు మార్చుతున్నా… ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకమైతే 200 స్థానాలు రావడం కూడా గొప్పేనని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. అయోధ్య రామాలయం, ఆర్టికల్‌ 370 రద్దు, సిఎఎ, ఎన్‌ఆర్‌సి లాంటివి ముందుకు తెస్తూ…ప్రతిపక్షాలవి కుటుంబ పరివార రాజకీయాలంటూ..ఆచరణలో దేశ, విదేశీ కార్పొరేట్‌ పరివారానికి సర్వం దోచిపెడుతున్నాడు. ఇంతకన్నా ఇంద్రజాలికుడు, నటుడు… ప్రకాష్‌రాజ్‌ చెప్పినట్లు ఇప్పటి ప్రపంచంలో లేడు..!
ఇప్పటికే ధరాభారం, నిరుద్యోగం, అవిద్య, అనారోగ్యంతో రుణాల ఊబిలో పీకల్లోతున కూరుకుపోయిన సామాన్యుడు తిరగబడే రోజు… తిక్కకుదిర్చే మంచి రోజులు ముందున్నాయని దేశవ్యాపిత పోరాటాలు, ఇండియా వేదిక సీట్ల సర్దుబాట్లు ఆశలు రేకెత్తిస్తున్నాయి.’ అంటూ ముగించాడు.

మోహన సిద్ధార్థ్‌

➡️