సిఇసికి టిడిపి – జనసేన, వైసిపిల పరస్పర ఫిర్యాదులు

Jan 10,2024 09:01 #CEC, #JanaSena, #Mutual complaints, #TDP, #YCP

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  : కేంద్ర ఎన్నికల సంఘం ముందు టిడిపి-జనసేన, వైసిపిలు పరస్పర ఫిర్యాదులకు దిగాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలకు మీరు కారణమంటే మీరు కారణమని ఆరోపించుకున్నాయి. సిఇసి రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల కమిషనర్ల బృందం విజయవాడలో మంగళవారం రాజకీయపార్టీలతో విడివిడిగా సమావేశమైంది. ఈ సమావేశానికి హాజరైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, అలయన్స్‌ పార్టనర్‌గా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, వైసిపి నుండి హాజరైన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పరస్పరం ఫిర్యాదులు చేశారు.

ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్నారు : చంద్రబాబు

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికల కమిషన్‌తో సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఎప్పుడూ లేనన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. దేశం మొత్తంమీద ఉత్తమంగా విధులు నిర్వహించిన వారిని ఎన్నికల అధికారులుగా నియమించాలన్నారు. దేశ వ్యాప్తంగా టీచర్లు, ప్రభుత్వ అధికారులు, అనుభవం ఉన్న వారిని ఎన్నికల విధుల్లో ఉపయోగించుకుంటున్నారని, రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైతే కేంద్ర పోలీసులను పంపాలని, స్పెషల్‌ సెల్‌ కూడా ఏర్పాటు చేయాలని కోరారు.

రాజ్యాంగ విరుద్ద వ్యవస్ధలతో ఎన్నికలు : పవన్‌కల్యాణ్‌

రాజ్యాంగ విరుద్ధ వ్యవస్థలతో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులతో ఓటర్లజాబితాలో అవకతవకలు చేశారన్నారు. సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులను బిఎల్‌ఓలుగా నియమించి వైసిపి ప్రభుత్వం ఇష్టానుసారంగా ఓట్లు తొలగిస్తున్న విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశామన్నారు.

ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు : విజయసాయి రెడ్డి

ఉద్దేశపూర్వకంగానే వైసిపిపై ఆరోపణలు చేస్తున్నారని వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఒకవైపు తమను టార్గెట్‌ చేస్తూ మరోవైపు పెద్దఎత్తున దొంగ ఓట్లను చేర్పిస్తున్నారని చెప్పారు. ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు లేని పార్టీ జనసేనకు సిఇసి అపాయింట్‌మెంట్‌ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై ఇసి వద్ద అభ్యంతరం తెలియచేసినట్లు చెప్పారు చంద్రబాబు, లోకేష్‌ సిఎంపై తీవ్ర అసభ్యపదజాలం వాడుతున్నారని సిఇసి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. రెడ్‌బుక్‌ పేరుతో అధికారులను లోకేశ్‌ బెదిరిస్తున్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ సమీక్ష సమావేశానికి టిడిపి నుండి పయ్యావుల కేశవ్‌, వైసిపి నుండి రాజమండ్రి ఎంపి మార్గాని భరత్‌, తుమ్మల లోకేశ్వరరెడ్డి, సిపిఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కారదర్శివర్గ సభ్యులు కిలో సురేంద్ర, రాష్ట్ర కమిటి సభ్యులు జె.జయరామ్‌, హాజరయ్యారు. బిజెపి నుంచి పాకల వెంకట సత్యనారాయణ, జూపూడి రంగరాజు, మట్టా ప్రసాద్‌, కాంగ్రెస్‌ నుంచి వాలిబోయిన గురునాధం, వేముల శ్రీనివాస్‌, బిఎస్‌పి నుంచి బి.పుష్పరాజ్‌, కాకి విసిఎస్‌ ప్రసాద్‌, ఎం, వినోద్‌కుమార్‌, ఆమ్‌ఆద్మీపార్టీ నుంచి గుల్లాపల్లి ఫణిరాజ్‌, కంభంపాటి కృష్ఱ, కందుల పరమేశ్వరరావు హాజరయ్యారు.

రాష్ట్ర ఎన్నికల అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం

రాష్ట్ర ఎన్నికల అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్ని వివరాలనూ తెలుసుకున్న తర్వాతే వచ్చామంటూ, విజయవాడ, తిరుపతి, అనంతపురం అధికారులపై సీరియస్‌ అయినట్లు తెలిసింది. ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రగిరి నియోజకవర్గంపై అధికారులను నిలదీసింది. ఇక్కడి అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తట్టుకోలేమంటే వెంటనే తప్పుకోవాలని సూచించింది. ఇక్కడి అధికారులకు రాజకీయ పార్టీలతో అనుబంధం ఉంటే తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల తర్వాత మంచి పోస్టింగుల్లోకి రావచ్చని తెలిపింది. రాష్ట్రంలో ఏ అధికారి ఎలా ఉన్నారో తమ దగ్గర రిపోర్టు ఉందని, తమకు తెలియదనుకోవద్దని కమిషన్‌ హెచ్చరించింది. మద్యం, డబ్బు పంపిణీ నిరోధంపై పలు జిల్లాల్లో తీసుకున్న చర్యలపై కమిషన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చర్చల సందర్భంగా చాలా అంశాల్లో జోక్యం చేసుకుని అధికారులను చీఫ్‌ కమిషనరు రాజీవ్‌ కుమార్‌ ప్రశ్నించారు. బోగస్‌ పేర్లు తొలగించాలని ఆయా పక్షాలు ఫిర్యాదులు ఇచ్చినా పరిశీలించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రాఫ్ట్‌ జాబితాలో అవే పేర్లు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఎన్నికల కమిషన్‌ బృందానికి వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో తీసుకొన్న చర్యలను, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలను జిల్లా ఎస్‌పిలు వివరించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాపై వస్తున్న ఫిర్యాదులు, దొంగ ఓట్లు తదితర అంశాలపై అధికారులను సిఇసి అధికారులు ప్రశ్నించారు.

వివి ప్యాడ్‌ స్లిప్‌లు ఇవ్వాలి : సిపిఎం

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి వివి ప్యాడ్‌ రశీదు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు( వైవి) తెలిపారు. ఓటర్ల తొలగింపులు, చేర్పుల విషయంలో వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, గంపగుత్తగా ఓట్ల తొలగింపులు చేస్తున్నారని, అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసినట్లు చెప్పారు. తెలంగాణలో ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిందని అక్కడ ఓటు వేసిన వారు ఇక్కడ ఓటు వేసే అవకాశం ఉందని అటువంటి ప్రక్రియ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 3నుంచి 20 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని, అందుకనే ఎక్కడికక్కడే పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేయాలని సిఇసి దృష్టికి తీసుకెళ్లినట్లు వైవి పేర్కొన్నారు.

➡️