బిజెపి అభ్యర్థులపైనే అత్యధిక క్రిమినల్‌ కేసులు

  •  41 శాతం స్థానాల్లో ముగ్గురు కంటే ఎక్కువ అభ్యర్థులపై కేసులు
  •  ఎడిఆర్‌ నివేదిక

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న తొలి దశ జరిగే 102 స్థానాల్లోని 42 స్థానాల్లో పోటీచేసే ముగ్గురు, అంతకంటే ఎక్కువ అభ్యర్థులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులను బిజెపి బరిలో దింపడం గమనార్హం. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) నివేదిక వెల్లడించింది. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. సుమారు 1,625 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఎడిఆర్‌ పరిశీలించింది. వీరిలో సుమారు 16 శాతం మంది అంటే 252 మంది అభ్యర్థులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 10 శాతం మంది అంటే 161 మంది తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. ఏడుగురిపై హత్యకేసులు, 19 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. 18 మంది అభ్యర్థులు మహిళలకు వ్యతిరేకంగా నేరాలు కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఒకరు అత్యాచార కేసు ఎదుర్కొంటున్నారు. 35 మంది అభ్యర్థులు విద్వేష ప్రసంగం కేసులు ఎదుర్కొంటున్నారని ఎడిఆర్‌ నివేదిక తెలిపింది. తొలి దశ జరిగే 102 స్థానాల్లోని 42 లేదా 41 శాతం స్థానాలు ‘రెడ్‌ ఎలర్ట్‌’ నియోజకవర్గాలు అని నివేదిక వెల్లడించింది. పోటీ చేసే అభ్యర్థుల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది అభ్యర్థులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటుంటే ఆయా నియోజకవర్గాలను రెడ్‌ ఎలర్ట్‌ నియోజకవర్గాలుగా పేర్కొంటారు.
పార్టీల వారీగా చూసుకుంటే బిజెపి అభ్యర్థులపైనే అత్యధికంగా క్రిమినల్‌ కేసులున్నాయి. ఆ పార్టీ తరపున పోటీలో ఉన్న 77 మందిలో 28 మంది అభ్యర్థులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి 19 అభ్యర్థులు (మొత్తం 56 మంది) అభ్యర్థులు, ఆర్‌జెడి నుంచి పోటీలో ఉన్న నలుగురు అభ్యర్థులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. డిఎంకె మొత్తం 22 మంది అభ్యర్థుల్లో 13 మంది క్రిమినల్‌ కేసుల్లో ఉన్నారు. ఎస్‌పి నుంచి ముగ్గురు (మొత్తం ఏడుగురు అభ్యర్థులు), టిఎంసి నుంచి ఇద్దరు (మొత్తం ఐదుగురు), క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎఐఎడిఎంకె నుంచి 13 మంది (మొత్తం 36 మంది అభ్యర్థులు), బిఎస్‌పి నుంచి 11 మంది (మొత్తం 86 మంది) అభ్యర్థులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.
28 శాతం మంది కోటీశ్వరులే
తొలిదశలో పోటీ చేసే అభ్యర్థుల్లో 28 శాతం మంది కోటీశ్వర్లు (కోటి రూపాయల కంటే ఎక్కువ ఆస్థి ఉన్నవారు) అని ఎడిఆర్‌ నివేదిక తెలిపింది. అభ్యర్థుల సగటు ఆస్థి రూ.4.51 కోట్లుగా తెలిపింది. బిజెపి నుంచి పోటీలో ఉన్న 69 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. కాంగ్రెస్‌ నుంచి 49 మంది అభ్యర్థులు, ఆర్‌జెడి ప్రకటించిన నలుగురు అభ్యర్థులు, ఎఐఎడిఎంకె నుంచి పోటీలో ఉన్న 35 మంది, డిఎంకె నుంచి పోటీలో ఉన్న 21 మంది అభ్యర్థులు, టిఎంసి నుంచి నలుగురు, బిఎస్‌పి నుంచి 18 మంది అభ్యర్థులు కోటీశ్వరులు.
కాంగ్రెస్‌ నుంచి చ్హింద్వారా (మధ్యప్రదేశ్‌) నుంచి పోటీలో ఉన్న నకుల్‌ నాథ్‌ రూ.716 కోట్ల ఆస్థితో అభ్యర్థుల్లో అందరి కంటే ధనవంతుడుగా నిలిచారు. ఈరోడ్‌ (తమిళనాడు) నుంచి పోటీలో ఉన్న ఎఐఎడిఎంకె అభ్యర్థి అశోక్‌ కుమార్‌ రూ. 662 కోట్ల ఆస్థితో రెండోస్థానంలో ఉన్నారు. తమిళనాడులోని శివగంగ నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి దేవనాథన్‌ యాదవ్‌ రూ.304 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

➡️