మొక్కలకు రక్షణగా దోమతెరలు

Apr 5,2024 21:03

ప్రజాశక్తి – కొమరాడ : ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, విష జ్వరాల బారిన పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నా, అవి క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదని స్పష్టంగా అర్థమవుతుంది. గిరిజనులకు దోమల వల్ల విష జ్వరాలు వ్యాపించకుండా ఉండేందుకు ప్రతి ఇంటికి అవసరమైన దోమతెరలను ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేసింది. దోమ తెరల వినియోగంపై వైద్య శాఖ అధికారులు పూర్తిగా చేతులెత్తియడంతో దోమతెరలను పంట పొలాల్లో వేసుకుని మొక్కలకు రక్షణగా గిరిజనులు ఏర్పాటు చేసుకునే దయనీయ పరిస్థితి మండలంలో జరుగుతుంది. మండలంలోని మసిమండ సమీపంలో గల పంట పొలాల్లో చెట్లకు రక్షణగా దోమతెరలను వినియోగించుకోవడం చూస్తే వైద్యశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పలువురు ప్రజాప్రతి నిధులు అంటున్నారు. మసి మండ నుంచి కప్పలాడ వెళ్లే గ్రామాల రహదారి పక్కనే ఉన్న మెట్టి ప్రాంతంలో దోమతెరలు విచిత్రంగా చెట్లకు రక్షణగా వేసిన దృశ్యం ‘ప్రజాశక్తి’ కంటపడింది. ముఖ్యంగా ఎన్నో లక్షల రూపాయలు వేయడంతో జ్వరాలు బారిన గెలిచిన ప్రజలు పడకుండా ఉండేందుకు రాష్ట్ర వైద్య శాఖ అనేక ప్రయత్నాలు చేస్తుంటే అవి అధికారులు నిర్లక్ష్యానికి తూట్లు పొడిచేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. దాదాపు 30 దోమతెరలను చెట్లకు రక్షణగా గిరిజనులు ఏర్పాటు చేసుకున్నారు. దోమతెరలు వినియోగంపై గిరిజనులకు ఎటువంటి అవగాహన కల్పించక పోవడం వల్లే వారు ఇలా వీటిని చెట్లకు వినియోగిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జ్వరాలు నివారణకు చేపడుతున్న చర్యలపై పూర్తిస్థాయిలో గిరిజనులకు వైద్యశాఖ అధికారులు సిబ్బంది అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని పలువురు ప్రజాప్రతినిధులు అంటున్నారు.

➡️