మళ్లీ మోడీ సర్కార్‌ బాదుడు

  • కమర్షియల్‌ ఎల్‌పిజి ధర రూ.21 పెంపు

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాగానే మోడీ సర్కార్‌ బాదేసింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ ధరను పెంచి… భారత్‌లో విమానాలకు వాడే ఏవియేషన్‌ టర్బైన్‌ ఇంధన (ఏటీఎఫ్‌) ధర 4.6 శాతం తగ్గించింది. ఇది ఒకే నెలలో రెండో తగ్గింపు కావటం గమనార్హం. అయితే వాణిజ్య వంట గ్యాస్‌ (ఎల్‌పిజి) రేటు 19 కిలోల సిలిండర్‌కు రూ.21 పెరిగింది. గృహావసరాల ఎల్‌పిజి ధర (14.2 కిలోల సిలిండర్‌పై)లో ఎలాంటి మార్పు లేదు. చమురు సంస్థలు వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్‌ ధరను రూ. 21 మేర పెంచాయి. దీంతో దీని ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాటిపై పడనున్నాయి. 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్‌ ఇప్పుడు దేశ రాజధానిలో రూ. 1,796.50గా, వాణిజ్య రాజధాని ముంబయిలో రూ. 1,749గా ఉన్నది. చమురు సంస్థలు సవరించిన ధరల ప్రకారం.. ఎటిఎఫ్‌ ధర రూ.5,189.25 (4.6 శాతం) తగ్గింది. ఢిల్లీలో కిలోలీటర్‌కు రూ.1,11,344.92 నుంచి రూ.1,06,155.67కి తగ్గింది. నవంబర్‌ 1న జెట్‌ ఇంధనం ధర దాదాపు 6 శాతం (కిలోలీటర్‌కు రూ. 6,854.25) తగ్గింది.

➡️