మంచి నీటితో వ్యాపారమా..?

Modi and Jagan governments doing business with good water

మోడీ, జగన్ ప్రభుత్వాలలపై ఆగ్రహించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు

ప్రజాశక్తి-విజయవాడ : అమృత్ పథకం పేరుతో విజయవాడలో నీటి మీటర్ల బిగించి మోడీ, జగన్ ప్రభుత్వాలు మంచి నీటితో వ్యాపారం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మండిపడ్డారు. మధురానగర్, పసుపుతోటలో సిపిఎం అండతో ప్రజా పోరాటం, నీటి మీటర్లను అధికారులు తొలగించారు. నీటి మీటర్లపై చిత్తశుద్ధితో పోరాడుతున్న సిపిఎం, కమ్యూనిస్టులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.   విజయవాడ మధురానగర్, పసుపు తోటలో బాబురావు నేతృత్వంలో సిపిఎం నేతలు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ…. 24 గంటల మంచినీటి సరఫరా పేరుతో, అమృత్ పథకం క్రింద 600 ఇళ్లకు నగరపాలక సంస్థ అధికారులు నీటి మీటర్లు బిగించారని పేర్కొన్నారు. కృష్ణా నదీ తీరాన విజయవాడలో నీటి మీటర్లు ఏర్పాటు సిగ్గుచేట్టన్నారు. బాబురావు నాయకత్వంలో సిపిఎం కార్యకర్తలు ఆనాడు ఇంటింటికి తిరిగి మీటర్ల ప్రమాదాన్ని ప్రజలకు తెలియజేశారు. సిపిఎం నాయకత్వంలో స్థానిక ప్రజలు, అసోసియేషన్లు నీటిమీటర్లకు వ్యతిరేకంగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ప్రభుత్వం ప్రజా ఆందోళనతో దిగివచ్చి నీటి మీటర్లను తొలగించిందన్నారు. అయితే మీటర్లను స్వాధీనం చేసుకోకుండా ఇళ్లలోనే ఉంచారని అన్నారు. ఎన్నికల అనంతరం మీటర్లు పెట్టాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. నీటి మీటర్లు ఏర్పాటు చేసే పట్టణ సంస్కరణల విషయంలో బిజెపి, తెలుగుదేశం, వైసీపీలది ఒకటే దారని వెల్లడించారు. మంచినీటితో వ్యాపారం చేయాలనే దుష్ట విధానాలకు వీరందరూ బాధ్యులేనని తెలిపారు. గతంలో విజయవాడ నగరపాలక సంస్థలో తెలుగుదేశం హయాంలో నీటి చార్జీలు విపరీతంగా పెంచారన్నారు. ప్రతి సంవత్సరం ఏడు శాతం పెంచే విధంగా తీర్మానాలు చేశారని మండిపడ్డారు. దాని ఫలితంగా నెలకు 40, 80 రూ” ఉన్న మంచి నీటి చార్జీలు క్రమంగా 200-400 రూ” కి పెరిగిందన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బిజెపి ఆదేశాలతో నీటి మీటర్లు బిగిస్తోందన్నారు. క్రమంగా విజయవాడ నగరంలో మొదటి దశలో లక్షలకు మీటర్లు బిగించడానికి టెండర్లు పిలిచారని తెలిపారు. ప్రజా ఆందోళనతో తాత్కాలికంగా మీటర్ల ఏర్పాటు ఆపారు. కానీ భవిష్యత్తు ప్రమాదం పొంచి ఉన్నదన్నారు. నీటి మీటర్లు ఏర్పాటు చేయాలనే బిజెపి, కేంద్ర ప్రభుత్వంతో జత కడుతున్న తెలుగుదేశం నీటి మీటర్లను అడ్డుకోలేదని తెలిపారు. నీటి మీటర్ల అడ్డుకోవాలంటే, చిత్తశుద్ధితో పోరాడే సిపిఎం, కమ్యూనిస్టులకు ఓటు వేసి సెంట్రల్ నియోజకవర్గంలో గెలిపించాలని కోరారు. గతంలో పట్టణ సంస్కరణలకు వ్యతిరేకంగా చెత్త పన్ను, నీటి మీటర్లు, ఆస్తిపన్నులకు వ్యతిరేకంగా విధాన పరంగా పోరాడింది కమ్యూనిస్టులేనని తెలిపారు. పది సంవత్సరాల వామపక్షాల కాలంలో నగరపాలక సంస్థలో నీటి చార్జీలు పెంచకుండా, భారాలు వేయకుండా ప్రజారంజక పాలన సాగించాయన్నారు. అందుకే కమ్యూనిస్టులకు ఒక అవకాశం ఇవ్వండి, సెంట్రల్ లో శాసనసభ్యుడిగా ఎన్నుకోవాలని కోరారు. నీటితో వ్యాపారం చేసే బిజెపి, తెలుగుదేశం, వైసీపీలకు బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ పాదయాత్రలో సిపిఎం నేతలు బి.రమణారావు, పి.కృష్ణమూర్తి, సుప్రజ, ప్రవీణ్, మోతి, నాగరాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

➡️