తప్పిన వెన్నుపోటు

Feb 4,2024 07:03 #Children, #Sneha, #Stories
Missed backstroke children story

బంగాళాఖాతం తీర ప్రాంతంలో విశాలమైన అడవి. అందులో రకరకాల జంతువులు ఉండేవి. అన్నీ ఐకమత్యంగా కలసిమెలసి ఉండేవి. అవన్నీ ఏకగ్రీవంగా ఆ అడవికి రాజుగా సింహాన్ని ఎన్నుకున్నాయి. కొద్దిరోజుల తర్వాత సింహం తన అడవిలో చక్కటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అనేక పథకాలను ప్రకటించింది. ఆ సంక్షేమ ఫలాలన్నీ దిగువ స్థాయి జంతువులకు సక్రమంగా అందేలా తగు చర్యలు తీసుకోవడానికి తనకు నమ్మకంగా, సన్నిహితంగా వున్న కొన్ని జంతువులను ప్రతినిధులుగా ఏర్పాటు చేసింది.

వారు తమకు కేటాయించిన ప్రాంతంలో ఉంటూ ఎప్పటికప్పుడు ఆయా ప్రాంత జంతువులకు ఎలాంటి లోటూ రాకుండా వారి బాగోగులు చూస్తూ ఉండాలని సింహం ఆదేశించింది. సింహం ఆదేశాల మేరకు అవి ఆయా ప్రాంతానికి వెళ్లి, అక్కడి వాటితో మమేకమై, అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తోంది. అడవిని సంక్షేమ ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో శ్రద్ధగా పనిచేయసాగాయి.

అడవిలో పనితీరు ఎలా ఉందో ఎప్పటికప్పుడు తనకు తెలియజేయడానికి, ఇంకా మంచి కార్యక్రమాలు ఎలా అమలుచేయాలనే విషయంలో తగు సలహాలు ఇవ్వడానికి ఒక ఎలుగుబంటిని మంత్రిగా ఏర్పాటు చేసింది.

ఇలాంటి అవకాశం కోసం కనిపెట్టుకున్న ఎలుగుబంటి సింహం కొలువులో చేరింది. కొద్దిరోజులు మంచిగా సలహాలు ఇస్తూ, సింహం దగ్గర బాగా నమ్మకం పొందింది. ఎలుగుబంటి సలహాలను తీసుకుంటూ మరిన్ని చక్కటి కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించింది.

కొద్ది రోజులకు సింహం ఎలుగుబంటిని పూర్తిగా నమ్మింది. అన్ని కార్యక్రమాలు చూసు కోవలసిందిగా ఎలుగుబంటికి పూర్తిగా బాధ్యతలను అప్పగించి, గుహలో హాయిగా వుండిపోయింది. ఇక అప్పటి నుంచి ఎలుగుబంటి తన కుట్ర బుద్ధి బయటపెట్టింది. మిగిలిన జంతువులకు చెందాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన వాటిని సకాలంలో పంపటం తగ్గించింది. సింహం నియమించిన ప్రతినిధులను తొలగిస్తానని బెదిరించి లొంగదీసుకుంది. రాజ్యంలో సింహం పట్ల వ్యతిరేకత కలిగేలా ప్రచారం చేయమని తన ఆంతరంగిక జంతువులైన నక్క, తోడేలును పురమాయించింది.

ఇదంతా గమనించిన ఏనుగు ఒకరోజు ఎలుగుబంటిని కలిసింది. దానితో ‘ఎలుగు బంటిగారూ..! సింహం రాజు మిమ్మల్ని నమ్మి, పెద్ద బాధ్యత అప్పగించారు. కానీ మీరు ఆయనకు చెడ్డ పేరు వచ్చేలా చేస్తున్నారు. ఇదేమంత మంచిపని కాదు. నమ్మిన వారికి వెన్నుపోటు పొడవటం న్యాయం కాదు, ఆలోచించండి’ అంది.

దానికి ఎలుగుబంటి పకపకా నవ్వుతూ, ‘ఏది న్యాయమో, ఏది అన్యాయమో నువ్వు నాకు చెప్పనవసరం లేదు. ఎప్పటినుండో నాకు ఈ సింహం అంటే కోపం. ఎలాగైనా దీనిని అధికారంలో నుండి దించాలనేది నా కోరిక. అదే నాకు అవకాశం ఇచ్చింది. ఎలాగైనా ఆ సింహాన్ని అడవిలో చెడ్డగా చూపించి, దానిని పదవి నుండి తొలగించడమే నా పని. అందుకే ఇలా చేస్తున్నా..’ అంటుండగానే, దాని భుజంపై బలంగా పంజా దెబ్బ పడింది.

ఒక్కసారిగా కెవ్వుమని వెనక్కి తిరిగి చూసింది. ఉగ్రరూపంలో వున్న సింహం కనిపించింది. గజగజ వణికిపోతూ ‘సింహరాజా.. మీరు..! మీరు’ అంది. ‘అవును నేనే సింహాన్ని! నమ్మి నీకు బాధ్యతలు అప్పగిస్తే నాకే వెన్నుపోటు పొడవాలకున్నావా? నీ గురించి ఏనుగు బావ చెబితే నమ్మలేదు. కానీ నిజం తెలుసుకోవాలని ఇద్దరం వచ్చాం. నీలాంటి నమ్మకద్రోహికి నా రాజ్యంలో చోటులేదు. వెంటనే ఈ అడవి వదిలి, ఎక్కడికైనా వెళ్ళిపో. మళ్ళీ నాకు కనిపిస్తే చంపి పారేస్తాను..’ అని గర్జించింది.

సిగ్గుతో తలవంచుకొని అడవి వదిలి, మరో ప్రాంతానికి వెళ్ళిపోయింది ఎలుగుబంటి.

వెన్నుపోటు నుండి తనను కాపాడి, తన కళ్ళు తెరిపించిన ఏనుగుకు ధన్యవాదాలు చెప్పి, దానిని మంత్రిగా నియమించుకొని, అడవిని చక్కగా పాలించసాగింది సింహం.

  • కైపు ఆది శేషారెడ్డి, 99857 14281
➡️