మైనింగా..మజాకా..!అన్నదాతలకు ‘రాయల్టీ”మెగా’కు లేదు ‘పెనాల్టీ’మెగాపైనే దయమిగిలిన వాటిపై నిర్దయ

మైనింగా..మజాకా..!అన్నదాతలకు 'రాయల్టీ''మెగా'కు లేదు 'పెనాల్టీ'మెగాపైనే దయమిగిలిన వాటిపై నిర్దయ

మైనింగా..మజాకా..!అన్నదాతలకు ‘రాయల్టీ”మెగా’కు లేదు ‘పెనాల్టీ’మెగాపైనే దయమిగిలిన వాటిపై నిర్దయప్రజాశక్తి-శ్రీకాళహస్తి భూగర్భ వనరులను కాపాడటంలో మైనింగ్‌ శాఖాధికారులది కీలక పాత్ర. పర్యావరణ సమతుల్యత ఏర్పడాలంటే భూగర్భ వనరులు అంతరించిపోకుండా కాపాడటం మైనింగ్‌ శాఖ విధి. అయితే అందుకు విరుద్ధంగా వ్యవరిస్తున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మైనింగ్‌శాఖాధికారులు. భూగర్భ వనరులు ఎలా అయినా చౌర్యమైపోనీ తమ చేతులు తడిస్తే చాలు అన్న చందాన వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అయిన వారికి ఆకుల్లో..కాని వారికి కంచాల్లో అన్న చందాన పెద్దలకో న్యాయం..సామాన్యులకో న్యాయం అన్న పంథాలో వారి తీరు ఉంటోందని చెప్పుకుంటున్నారు. చేతులు తడిపితే చెరువులకు చెరువులు లోయలు చేసినా అడిగే నాథుడు ఉండడనీ.. తడపకుంటే సొంత భూమిలో మట్టి తీయాలన్నా నిబంధనలు అడ్డు చెప్తాయంటూ మైనింగ్‌ అధికారులపై ప్రజలు బాహాటంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తారమైన ఇసుక, ఎర్ర గుళ్ల, మట్టి, మెటల్‌, కాసిరాయి లాంటి భూ గర్భ నిక్షేపాలున్నాయి. ఈ నిక్షేపాలు నానానిటికీ అంతరించిపోతున్నాయి. కొందరు పరిమితికి మించి క్వారీలు, క్రషర్లు, నదులు, పొలాల్లో తవ్వకాలు జరిపి నిక్షేపాలను తరలించుకుపోతున్నా మైనింగ్‌్‌శాధికారులు అడగరు. సామాన్యుడు యూనిట్‌ మట్టి, కంకర, ఇసుక తోలుకోవాలన్నా మైనింగ్‌ శాఖకు రాయల్టీ కట్టాల్సిందే. ఈ లెక్కన మెఘా సంస్థ నాయుడుపేట-మదనపల్లి జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టిన నాటి నుచి నేటి వరకు కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని, ఎర్ర గుళ్లను అక్రమంగా తరలించిందన్న ఆరోపణలున్నాయి. మరి మెఘా సంస్థ నుంచి మైనింగ్‌శాఖ ఎన్ని కోట్లు రాయల్టీ రాబట్టిందో చెప్పాలి మరి. సొంత భూమిలో మట్టి తీయాలన్నా ‘రాయల్టీ’నియోజకవర్గం వ్యాప్తంగా వందలాది ఇటుక బట్టీలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాళహస్తి పట్టణంతో పాటు తొట్టంబేడు మండల వ్యాప్తంగా ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ క్రమంలో ఇటుకల తయారీకవసరమైన మట్టిని తమ సమీప రైతుల పొలాల నుంచి, సొంత పొలాల నుంచి సేకరిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో మైనింగ్‌ శాఖాధికారులు ఇలా చేయడం తప్పనీ, యూనిట్‌ మట్టికి రూ.500 చొప్పున రాయల్టీ చెల్లించి మట్టిని తోలుకోవాలని నిబంధనలు పెడుతున్నారు. దీంతో ముక్కున వేలేసుకోవడం ఇటుక బట్టీల యజమానులు వంతవుతోంది. ఇటుకల తయారీకి తాము వినియోగిస్తున్న మట్టి పూర్తిగా తమ సొంతం, లేకుంటే సమీప రైతుల పొలాల నుంచి తీసుకుంటున్నామనీ, తమ పొలాల్లో మట్టిని తరలించినా మైనింగ్‌్‌ అధికారులకు పెనాల్టీ కట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓ మైనింగ్‌్‌ శాఖాధికారి అయితే నిత్యం ఇటుక బట్టీల చుట్టూ చక్కర్లు కొడుతూ మట్టి తోలుకుంటున్న బట్టీ యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు సమాచారం. మీకు ఆ ప్రజా ప్రతినిధి నుంచి అనుమతి ఉంటే మట్టి తోలుకోండి, లేకుంటే మైనింగ్‌ శాఖకు రూ.350 నుంచి రూ.500 రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ బెదిరిస్తున్నట్లు బట్టీ యజమాని ఒకరు వాపోయారు. తన పాత బట్టీ లీజు కాలం ముగిసిందనీ, కొత్త బట్టీ వద్దకు పాత బట్టీలోని మట్టిని తరలించాలన్నా సదరు అధికారి ట్రాక్టర్‌కు రూ.500 చెల్లించాలని బెదిరించినట్లు సదరు బట్టీ వ్యాపారి తెలిపాడు. ప్రస్తుతం ఇటుక బట్టీల నిర్వహణ కష్టతరమవుతోందనీ, భవన నిర్మాణరంగం కుదేలైన నేపథ్యంలో వ్యాపారంలో నష్టాలు కూడా చవిచూస్తున్నామనీ, ఈ తరుణంలో మైనింగ్‌శాఖాధికారులు ఇలా వ్యవహరించడం ఎంతవరక సబబని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు విలవిలఇప్పటికే రాష్ట్ర మైనింగ్‌ శాఖ తీసుకున్న పలు నిర్ణయాల వల్ల ఇసుక బంగారమైపోయింది. ఎర్ర గుళ్లదీ అదే పరిస్థితి. ఇక క్రషర్ల వద్ద ఓ ప్రైవేటు కంపెనీ తిష్టవేసి మరీ యూనిట్‌ కంకర, చిప్స్‌పై ఏకంగా రూ.700 రాయల్టీ వసూలు చేస్తోంది. ఒకప్పుడు ట్రాక్టర్‌ బాడుగను కలుపుకుని యూనిట్‌ చిప్స్‌ ఇంటికి చేరాలంటే కేవలం రూ.2 వేలే అయ్యేది. ఇప్పుడు రూ.4 వేలు లేందే యూనిట్‌ కంకర కానీ, చిప్స్‌ గానీ ఇంటికి చేరని పరస్థితి. అదేవిధంగా ఇసుక పరిస్థితి తయారైంది. ఒకప్పుడు యూనిట్‌ ఇసుక ఇంటికి ఉచితంగా చేరింది. నేడు రూ.3 నుంచి రూ.4 వేలు అవుతోంది. దీంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఇంకో వైపు సొంత అవసరాలకు మట్టిని తోలుకోవాలన్నా మైనింగ్‌ శాఖ ఆంక్షలు విధిస్తుండటం, పెనాల్టీ కట్టాలని బెదిరిస్తుండటంతో సామాన్యులు, ఇటుక బట్టీ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అక్రమార్కుల చేతుల్లో నిత్యం వేల టన్నుల్లో ఇసుక, మట్టి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయనీ, వాటిని నిలువరించలేని మైనింగ్‌ అధికారులు సామాన్యులపై ప్రతాపం చూపడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మైనింగ్‌ శాఖాధికారులు సామాన్యుల పట్ల పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

➡️