మా బకాయి బిల్లులు చెల్లించండి

Feb 5,2024 16:42 #Vizianagaram
mid day meals protest vzm

మెను చార్జీలు రెట్లు పెంచాలి
గౌరవ వేతనం 10 వేలు ఇవ్వాలి
ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు డిమాండ్
డీ ఈ ఓ కార్యాలయం వద్ద బైటాయింపు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మధ్యాహ్నభోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని , బకాయి బిల్లులు చెల్లించాలని, మెనూ చార్జీలు పెంచాలని,గౌరవ వేతనం పది వేలకు పెంచి చెల్లించాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ జిల్లా కార్యదర్శి బి సుధారాణి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా విద్యా శాఖ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో కలిసి బైటాయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో ‘మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. మంచి లక్ష్యాలతోను ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యాలకి విరుద్ధంగా ఈ. పథకాన్ని నీరుగారుస్తున్నాయన్నారు. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.గత 23 సం॥ల నుండి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మేము అధికారంలోకి వస్తే రూ. 10 వేలు వేతనం ఇస్తామని హామి ఇచ్చారు. ఆ హామీని అమలు చెయ్యాలని, ప్రతి నెలా 5వ తేది లోపు వేతనాలు, బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని, 12 నెలలకు వేతనాలు ఇవ్వాలని, మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు రూ. 20/-లకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని, వంటచేసేటప్పుడు అగ్నిప్రమాదానికి గురైనటువంటివారికి నష్టపరిహారం చెల్లించాలని, స్కూల్స్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేయాలని, ఇఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పథకాన్ని (ప్రైవేటుసంస్థలకు అప్పగించరాదని, మౌలిక సదుపాయాలు అయిన మంచినీరు, వంటషెడ్, గ్యాస్ స్టవ్ ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలని, 2 నెలలకు ఒకసారి వర్కర్లతో ఎంఇఓలు సమావేశాలు పెట్టాలని ఎపి మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ (సిఐటియు) రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటి డీ ఈ ఓ బ్రహ్మాజీ వచ్చి కార్మికులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయనకు వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు ఏ.జగన్మోహన్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు.

➡️