మళ్లీ మెట్రో రైలు ‘రాజకీయం’!

Dec 17,2023 11:40 #Metro train, #politics
  • నష్ట అంచనాల్లేకుండా జనవరిలో శంకుస్థాపనా ?
  • మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు
  • 20:20 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది
  • 60 శాతం బిడ్డింగ్‌ దక్కించుకున్న సంస్థదే !
  • కేంద్ర సహకారంపై అనుమానాలు
  • రాష్ట్రంపై మరింత ఆర్థిక భారం

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : 2024 ఎన్నికలు రానుండడంతో విశాఖ మెట్రో రైలు ప్రతిపాదనను కేంద్ర, రాష్ట్ర పాలకులు మళ్లీ తెరపైకి తెచ్చారు. అయితే, ఇది తెల్లఏనుగు అని, ప్రభుత్వాల ఖజానాలను మింగుతుందని అధికారంలోకి రాక ముందు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనే తాజా కేబినెట్‌ సమావేశంలో ఇదే ప్రాజెక్టుకు గ్రీన్‌సిగల్‌ ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2017లో విశాఖ మెట్రో రైలు 144 కిలోమీటర్లకయ్యే ఖర్చు రూ.35 వేల కోట్లుగా అంచనా వేశారు. డిపిఆర్‌లో ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కన్సార్టియంకు అప్పగించాలని నాటి ప్రభుత్వం చూసింది. నిర్మాణం ప్రారంభమైతే ఎక్కడెక్కడ భవనాలు, ప్రాంతాలకు నష్టం కలుగనుందో ఇంతవరకూ ఎలాంటి అంచనాలు, నివేదికలూ లేవని రైల్వే, ఎంఎల్‌టిఎన్‌ ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఇంత ఖర్చా? అంత నష్టమా? అంటూ 2019లో అధికారంలో వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2020 డిసెంబరు 30న దీన్ని రద్దు చేసింది. తాజాగా విశాఖ మెట్రోకు రూ.14,309 కోట్లతో ప్రతిపాదనను జగన్‌ ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంట్లో, చెరో 20 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదని పేర్కొంది.

కేంద్రం సాయం చేస్తుందా ?

కేంద్రం వాటా రూ.2,861 కోట్లు కాగా, 60 శాతం అంటే రూ.8,585 కోట్లు మేర పిపిపిలోకి ప్రభుత్వం వెళ్లనుంది. అమరావతి నిర్మాణానికే ఒక్క రూపాయి కూడా సాయం అందించని, రైల్వే జోన్‌ విషయాన్ని కూడా సాగదీస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం విశాఖ మెట్రోకు సహకరిస్తుందా? అంటూ మెట్రో రైలు నిర్మాణంలో కీలకపాత్ర పోషించగల, గతంలో మెట్రో ప్రాజెక్టు భేటీల్లో పాల్గొన్న రైల్వే నిపుణులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అండర్‌ గ్రౌండ్‌ నుంచి మెట్రో రైల్‌ లైను వెళ్తున్నప్పుడు కింద ఉన్న భవనాలకు జరిగే నష్టం, పగుళ్లు వంటివి ఎలా నివారిస్తారన్న అంచనాలు సైతం ఇంతవరకూ డిపిఆర్‌లో లేవని వీరు చెబుతున్నారు. మరోవైపు మూడు రాజధానుల వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉంది. సుమారు రూ.9 వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఏ ప్రయివేట్‌ సంస్థ ముందుకొస్తుంది. ఒకవేళ పిపిపిలో ఏదో ఒక బిడ్డరు వచ్చినా మెట్రో ధరల మోత మోగించకుండా ఉంటారా? అన్నవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతాయి. వాస్తవానికి మెట్రో ప్రాజెక్టు పూర్తికి ఎనిమిదేళ్లు కనీస సమయం పడుతుంది. 2024 ఎన్నికల్లో రాజకీయ లబ్ధికే జగన్‌ ప్రభుత్వం కేంద్రంతో కూడబలుక్కుని మెట్రో రైలంటూ ఎన్నికల కూత పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విశాఖకు మెట్రో అర్హత లేదా ?

ఏనాడో విశాఖలో మెట్రో లైన్లు పడాలి అంటూ రైల్వే ఇంజనీరింగ్‌, సాంకేతిక నిపుణులు తాజాగా చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా అర్బన్‌ సిటీల్లో జన సాంద్రత పెరుగుతున్న క్రమంలో ట్రాఫిక్‌ భారం నుంచి బయటపడేందుకు నగరంలోని ఒక చివర నుంచి మరో చివరకు కనెక్టివిటీ ఇచ్చేందుకు మెట్రోల అవసరం ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. విశాఖకు కూడా ఆ అవసరం ఉందన్నది మెట్రో, రైల్వే నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత విశాఖ నగరంలో 27 లక్షల జనాభా ఉంది. తాజా మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే 41 లక్షలు జనాభా ఉంటుంది. స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి కొమ్మాది జంక్షన్‌కు 34.40 కిలోమీటర్లు, 29 స్టేషన్లుగా, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసుకు 5.07 కిలోమీటర్లు ఆరు స్టేషన్లుగా, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరుకు 6.75 కిలోమీటర్లు ఏడు స్టేషన్లుగా, కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌ పోర్టుకు 30.67 కిలోమీటర్లు 12 స్టేషన్లుగా వెరసి నాలుగు కారిడార్లు, మొత్తం 76.90 కిలోమీటర్లుగా మెట్రో నడకను నిర్ణయించారు.

➡️