చెప్పిందే చేస్తాను… : సిఎం రేవంత్‌ రెడ్డి

  • సంస్కరణలతో అత్యుత్తమ పాలన
  • అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం
  • ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో
  • ఫార్మాసిటీ యథాతథం

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో: తాను చెప్పిందే చేస్తానని, చెప్పేది ఒకటి, చేసేది వేరొకటి ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా సంస్కరణలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా విశాల ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. ఉన్నతాధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం అమలు చేస్తామన్నారు. మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఏ మాత్రమూ నిజం లేదని, గతంలో కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సిఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మియాపూర్‌ నుంచి మైండ్‌ స్పేస్‌ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు పొడిగిస్తామని చెప్పారు. తాము కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని వివరించారు. ఫార్మా సిటీని పకడ్బందీగా ప్లాన్‌ చేస్తున్నామని, రింగ్‌ రోడ్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రత్యేక క్లస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. వంద పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని, విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్‌ ఇప్పిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు సిఎంగా తాను చేస్తానని, వాళ్ల పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలన్నారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ నియామకం తర్వాతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్‌ పదవులు ఉంటాయని, పైరవీలకు ఏ మాత్రమూ తావులేదని వివరించారు.

➡️