పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే విధానం

May 4,2024 00:17 #2024 election, #Postal ballot

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, అధికారులు ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకుంటారు. ఎక్కడ నుండైనా వారికి కేటాయించిన ప్రాంతంలో నుండి ఓటు వేసుకునే విధంగా దీనిలో అవకాశం ఉంటుంది. ఐదు, ఆరు, ఏడు తేదీల్లో కేటాయించిన ఫెసిలిటేషన్‌ సెంటర్లో ఓటు హక్కును వినియోగిం చుకోవచ్చు. ఇలా ఓటు వేసుకునేందుకు నాలుగు రకాల ఫారాలు ఇస్తారు. ఇందులో ఫారం అంటే పూర్తి చేసి ఇచ్చేది కాదు. ఓటును పెట్టే కవర్‌ను కూడా ఫారంగానే పరిగణిస్తారు. దీనిలో 13ఎ(ఫారం-ఏ) ఇది డిక్లరేషన్‌, 13బి (ఫారం-బి) చిన్న కవర్‌, 13సి(ఫారం-సి) పెద్దకవర్‌, బ్యాలెట్‌ పేపర్‌-13డి ఉంటుంది. 13డిలో ఓటు ఎలా వేయాలనే అంశానికి సంబంధించిన సూచనలు ఉంటాయి. ఇది ఓటు వేసే వారికోసమే ఇస్తారు. 13ఏ ఇది పేపరు రూపంలో ఉంటుంది. దీనిమీద మన వివరాలు పూర్తిచేసి గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించాలి. సంతకం చేసే అధికారి కూడా అక్కడే ఉంటారు. 13బి అంటే ఎన్వలప్‌ కవర్‌ ఉంటుంది. ఇది చిన్న కవరు మాత్రమే. దీనిమీద బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌ రాసి ఇస్తారు. దీనిలో మనం అనుకున్న వ్యక్తికి టిక్‌మార్కుపెట్టి ఫారం బి కవర్లో పెట్టి సీల్‌ వేయాలి. అనంతరం 13సి రూపంలో ఇచ్చే పెద్దకవరులో పెట్టిన తరువాత ఏ అసెంబ్లీ, పార్లమెంటు అయితే వాటిపేరు రాయాల్సి ఉంటుంది. అనంతరం తొలుత ఇచ్చిన డిక్లరేషన్‌ ఫారం, బ్యాలెట్‌ను చిన్న కవర్లో పెట్టిన తరువాత రెండిటినీ కలిపి పెద్దకవర్లో పెట్టి సీల్‌ చేసిన బాక్సులో వేసేయాలి. ఒకవేళ దీనిపై అవగాహన కలగకపోతే అక్కడే పోలింగు అధికారి, అసిస్టెంట్‌ పోలింగు అధికారి కూడా ఉంటారు. ఓటు వేసిన తరువాత ఎలా చేయాలో ఏమి చేయాలో దగ్గరుండి వివరిస్తారు.

➡️