ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు సభ్యత్వం

May 2,2024 23:56 #palasteena, #United Nations
  •  ఆశాభావం వ్యక్తం చేసిన భారత్‌

నూయార్క్‌ : ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నాలు పున:పరిశీలించబడతాయని, ఒక సభ్యురాలిగా మారేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయని భారత్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. గత నెలలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముసాయిదా తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు రాగా, స్విట్జర్లాండ్‌, బ్రిటన్‌ గైర్హాజరయ్యాయి. తీర్మానం ఆమోదించబడాలంటే అనుకూలంగా 9 ఓట్లు రావాలి, శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌, అమెరికాల్లో ఏదీ వీటో చేయకూడదు. రెండు దేశాల ఏర్పాటే పాలస్తీనా సమస్యకు పరిష్కారమార్గమని భారత్‌ భావిస్తూ వస్తోందని, అందుకు అనుగుణంగా తగు సమయంలో పాలస్తీనా ప్రయత్నం ఫలించి పూర్తిస్థాయి సభ్యురాలిగా మారాలని కోరుకుంటున్నట్లు ఐక్యరాజ్య సమితిలో భారత్‌ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్‌ చెప్పారు. ప్రస్తుతం పాలస్తీనా సభ్య దేశం కాని పరిశీలకురాలి హోదాలో వుంది. 2012లో జనరల్‌ అసెంబ్లీ దీన్ని మంజూరు చేసింది. దీనివల్ల ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యకలాపాల్లో పాలస్తీనా పాల్గొనగలదు, కానీ తీర్మానాలపై ఓటు వేయలేదు. సురక్షితమైన సరిహద్దులతో కూడిన, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో కూడిన పాలస్తీనాలో ప్రజలు జీవించాలని భారత్‌ కోరుకుంటోందన్నారు. ఈ శాశ్వత పరిష్కారాన్ని సాధించే దిశగా ప్రత్యక్ష శాంతి చర్చలు సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించబడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

➡️