వైద్య సేవలు సంతృప్తినిచ్చాయి

Apr 20,2024 21:15

ప్రజాశక్తి – పార్వతీపురం : ప్రజల మనసుల్లో చెరగని వైద్యుడిగా పేరు గుర్తుండేలా రోగులకు వైద్య సేవలు చేయడంలో పొందే సంతృప్తి ఇంక దేనిలో ఉండదని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బగాది జగన్నాథరావు అన్నారు. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయు సందర్భంగా ‘ప్రజాశక్తి’తో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలు వారి మాటల్లోనే… జిల్లాల పునర్విభజనకు ముందు శ్రీకాకుళం, ప్రస్తుత విజయనగరం జిల్లాలో ఉన్న సంతక కవిటి మండలం గెడ్డవలస, నరసింహపురం (జిఎన్‌ పురం)లో 1962 మే 1న కీర్తిశేషులు బగాది పోలినాయుడు, వరలక్ష్మి దంపతులకు రెండవ సంతానం. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి ప్రాథమిక విద్యను స్వగ్రామంలో చదువుకున్నాను. ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు సిరిపురం జడ్పీ హైస్కూల్లో చదవగా, పొందూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్య పూర్తి చేశాను. ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్‌ ఉన్నత విద్యను చదివాను. 1986లో కాంట్రాక్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి అవకాశం రాగా, అదే ఏడాది డిసెంబర్‌ 10న శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో మెడికల్‌ ఆఫీసర్‌గా తొలుత ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమమైంది. అప్పటి నుండి ఐదేళ్లు గుత్తావల్లి, తొగరాంలో వైద్య సేవలు చేస్తుండగా 1991 డిసెంబర్‌ 25న పర్మినెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా అవకాశం ఉంది. ఇక్కడ 12 ఏళ్ల వైద్య సేవలు అందించగా, 2002లో శ్రీకాకుళం అర్బన్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్‌ కు బదిలీపై వచ్చాను. 2007లో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం జిల్లా బుడితికి బదిలీపై వచ్చి వైద్య సేవలందించాను. 2011లో సిహెచ్‌ఎన్‌సి ఫ్యాట్రాన్‌లో ఆముదాలవలసకు బదిలీ అయింది. మళ్లీ 2017లో డిఐఒగా ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం బదిలీపై వచ్చాను. 2019లో సివిల్‌ సర్జన్‌గా ఉద్యోగోన్నతి పొంది శ్రీకాకుళం అడిషనల్‌ జిల్లా వైద్యాధికారిగా విధులు చేపట్టాను. అక్కడ నుంచి 2022 లో జిల్లాల పునర్విభజన జరగడంతో కొత్తగా ఆవిర్భంచిన పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీపై వచ్చి జిల్లా వైద్యాధికారి బాధ్యతలను చేపట్టి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ వరకు ఇక్కడే విధులను నిర్వహిస్తున్నాను. రోజుకు 50కి పైగా రోగులకు ఒపి చూడడం సంతప్తినిచ్చింది. తమ సర్వీస్‌ కాలంలో అత్యధికంగా 50వేల నుంచి 60 వేల వరకు ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్లు చేసి లక్ష్యాలను అధిగమించడంలోనూ, డయేరియా అదుపు చేయడంలోనూ మంచి కృషి చేశాను. దీనికి ఫలితంగా 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేతుల మీదగా రాష్ట్రస్థాయి అవార్డులు పొందడం చాలా సంతోషాన్నిచ్చింది. జిల్లాస్థాయిలో పది దఫాలు ఉత్తమ వైద్యునిగా ప్రశంసలు పొందడం ఆనందాన్నిచ్చింది. 2020లో కోవిడ్‌ మహామ్మారికి ప్రజలు భయాందోళన చెందారు. అనేకమంది వైద్యులతో సహా ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఆ సమయంలో కోవిడ్‌ నోడల్‌ అధికారిగా అంకితభావంతో పనిచేయడం చాలా సంతృప్తిమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇమ్యునైజేషన్‌ ప్రణాళికల్లో ఒక సభ్యునిగా ఉంటూ ప్రత్యేక గుర్తింపును పొందాను. ఇంత పేరు రావడానికి నా భార్య విజయలక్ష్మి అనుక్షణం తనకు తోడుగా నిలబడి సహకార అందించడంతోనే సాధ్యమైంది. నా కుమారుడు సంతోష్‌ విట్‌లో బిటెక్‌ పూర్తి చేసి, అమెరికాలో ఎంఎస్‌ ఎంఎస్‌ పూర్తి చేశాడు. కుమార్తె డాక్టర్‌ శ్రావ్య చిల్డ్రన్‌ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కొంత కాలం విశ్రాంతి తీసుకొని మళ్లీ ప్రజలకు వైద్యసేవలందించాలని సంకల్పిస్తున్నాను.

➡️