ప్రసూతి సెలవుల్లో వివక్ష తగదు

  •  రెగ్యులర్‌, కాంట్రాక్టు ఎవరైనా ఒకటే 
  • కలకత్తా హైకోర్టు స్పష్టీకరణ

కోల్‌కతా : ప్రసవం, ప్రూతీ శలవుకు సంబంధించి ఒక మహిళకు గల హక్కుపై రెగ్యులర్‌, కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడా వుండరాదని కోల్‌కతా హైకోర్టు స్పష్టం చేసింది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ)లో ఎగ్జిక్యూటివ్‌ ఇంటర్న్‌గా 2011 ఆగస్టు 16 నుండి మూడేళ్ళ కాలానికి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పని చేస్తున్న పిటిషనర్‌ ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించారు. వేతనంతో కూడిన 180రోజుల ప్రసూతి శలవును అనుమతించడంలో ఆర్‌బిఐ విఫలమవడాన్ని ఆమె ప్రశ్నించారు. ఈ కేసులో జస్టిస్‌ రాజా బసు చౌదరి సోమవారం తీర్పునిస్తూ పై విషయం స్పష్టం చేశారు. ప్రసవించడానికి, ప్రసూతి శలవకు మహిళకుండే హక్కు విషయంలో బేధం చూపడానికి అనుమతించబడదని చెప్పారు. తక్షణమే పిటిషనర్‌కి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా బ్యాంక్‌ను కోర్టు ఆదేశించింది. ఏ శలవు కాలాన్ని అయితే తిరస్కరించారో అదే కాలానికి ఆమెకు వేతనంతోకూడిన శలవును ఇవ్వాలని చెప్పింది. మాస్టర్‌ సర్క్యులర్‌ ప్రకారం తమ మహిళా ఉద్యోగులకు ప్రసూతి ప్రయోజనాలను ఆర్‌బిఐ సాధారణంగా అందచేస్తూ వుంటుందని, అలాంటి ప్రయోజనాలను ఇక్కడ పిటిషనర్‌కు వర్తింప చేయలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఒక వర్గం పరిధిలో మరొక వర్గాన్ని సృష్టించేందుకు తీసుకున్న ఇది వివక్షాపూరితమైన చర్యే అని తాను అభిప్రాయపడుత్నుట్లు చెప్పారు. ఇది భారత రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘిస్తోందని కోర్టు పేర్కొంది. ప్రసూతీ ప్రయోజనాల చట్టం, 1961 అర్ధం పరిధిలో ఇది వివక్ష ప్రదర్శించే చర్యే కాకుండా నేరం కూడానని స్పష్టం చేసింది.

చట్టంలోని 5(1) క్లాజు ప్రకారం ప్రతి మహిళ ప్రసూతి ప్రయోజనాల చెల్లింపునకు అర్హురాలని ఆమెకు ఉద్యోగమిచ్చిన యజమాని చెల్లించాల్సిందేనని పేర్కొంది. 2012 నవంబరు 30వ తేది రాసిన లేఖలో ఆమె ఆరు మాసాల పాటు ప్రసూతి శలవుకు దరఖాస్తు చేసుకుంది. డిసెంబరు 3 నుండి అమల్లోకి వచ్చేలా ఈ శలవు ఇవ్వాల్సిందిగా కోరింది. ఆమెకు బెడ్‌ రెస్ట్‌ కావాలని డాక్టర్లు సూచించారు. 2013 జనవరి మొదటి ఆర్ధభాగంలో ఆమె ప్రసవ తేదీ వుంటుందని సూచించారు. ఆ సమయంలో పిటిషనర్‌ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు ఎలాంటి సమాచారం లేకపోగా కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఆమెకు ప్రసూతి శలవు రాదని అదే ఏడాది మార్చి 14వ తేదీ లేఖలో తెలియచేశారు. ఆమె విదులకు హాజరు కాకపోవడాన్ని నష్టపరిహారం లేని శలవుగా వ్యవహరిస్తామని కూడా తెలియచేశారు. బ్యాంక్‌లో జూనియర్‌ మోస్ట్‌ ఆఫీసర్లుకు వర్తించే మెడికల్‌ ప్రయోజనాలు ఆమెకు అందుతాయని తెలిపారు.

అయితే ఉద్యోగ కాంట్రాక్టు ఒప్పందం ప్రసూతి ప్రయోజనాల చట్టంపై ఎలాంటి ప్రభావాన్ని చూపదంటూ పిటిషనర్‌ తరపు న్యాయవాది మాలిని చక్రవర్తి వాదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ, ఆమె కాంట్రాక్టులోనే నిబంధనలన్నీ వున్నాయని, అవన్నీ తెలిసే పిటిషనర్‌ సంతకం చేశారని, కనుక ఆమెకు ఈ ప్రయోజనాలు వర్తించబోవని బ్యాంక్‌ తరపు న్యాయవాది వాదించారు.

➡️