మట్టి బొమ్మల మాస్టారు..

Jan 29,2024 09:40 #feature

కొంతమంది వ్యక్తులు పైకి చాలా సాధారణంగా కనిపిస్తారు. బాగా తెలిసిన వారికే వాళ్ల ప్రతిభ, పాటవాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న తమిళనాడుకు చెందిన పెద్దాయన కూడా ఆ కోవలోకే వస్తారు. తమిళనాడు తిరునవెల్లి అంబసముద్రం ప్రాంతంలో జి. చంద్రశేఖరన్‌ అలియాస్‌ చంద్రు గురించి తెలియని వారుండరు. మట్టి ప్రతిమలు చేయడం ఆయన ప్రత్యేకత. మట్టితో బొమ్మలు చేయడం చాలామందికి తెలిసిన విద్యే. అందమైన రంగులతో వాటికి ఎంతో ప్రత్యేకత తీసుకువస్తారు చాలామంది. కానీ చంద్రు బొమ్మలు అలాంటివి కాదు. కేవలం బంకమట్టితోనే ఏవిధమైన కృత్రిమ రంగులు వేయకుండా మనిషి రూపాన్ని ఫొటో తీసినట్లు కళ్లముందుంచుతారు. అదే ఆయన్ను అంతలా గుర్తుంచుకునేలా చేసిందా అంటే అవుననే చెప్పాలి. అయితే చంద్రు గురించి ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. మట్టి పిసుక్కుని బొమ్మలు చేస్తున్న చంద్రు తమిళనాడు ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించి రిటైరయ్యారు. ప్రధానోపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన తన విశ్రాంత సమయం ఈవిధంగా గడపడం చూసేవారికి వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

               థామిరాబరని నది ఒడ్డున పచ్చటి ప్రకృతి నీడలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఓ తాటిచెట్టు కింద వేసిన పాకలో తెల్ల పంచె, జబ్బల బనీను వేసుకుని ఒళ్ళంతా మట్టి పూసుకుని కనిపిస్తున్న చంద్రు మలిచిన బొమ్మలన్నీ తమిళనాడు ప్రముఖ వ్యక్తులవే. సామాజికవేత్తలు, విద్యావేత్తలు, సోషలిస్టు నాయకులు, సంఘసంస్కర్తలు, తమిళనాడు సాంస్క్రృతిక వైభవానికి కృషిచేసిన కళాకారులు, గాయకులు, నృత్య కళాకారులు ఇలా ఎంతోమంది ఆయన చేతి మట్టిలో అందంగా ఒదిగిపోయారు. ఇటీవల మరణించిన తమిళనాడు వామపక్ష నాయకుడు వి. శంకరయ్య ప్రతి రూపాన్ని కూడా ఈమధ్యే తయారుచేశానని చంద్రు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌ కాలంలో ఓ వ్యాపకంలా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఓ బృహత్తర కార్యక్రమంలా మారిపోయింది. ఒకటి, రెండు కాదు 600 వందల మట్టి ప్రతిమలు తయారుచేసిన చంద్రు వాటన్నింటినితో ఓ మ్యూజియాన్నే నడిపిస్తున్నారు. ‘గురు వనం’ పేరుతో తలపెట్టిన ఈ మ్యూజియం నిర్వహణ అంతా చంద్రు దగ్గర విద్యనభ్యసించిన విద్యార్థులు, అతని స్నేహితుల చొరవతోనే సాగుతోంది. అయితే ‘ఇంత పెద్ద కార్యం నా ఒక్కడి వల్లే అయ్యేది కాదు. ఈ ప్రశంసలన్నీ నాకే చెందడం భావ్యం కాదు. ఇందులో నా భార్య ముత్తులక్ష్మి పాత్ర ఎంతో వుంది. ఆమె తోడు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాద’ని భార్య ఇస్తున్న తోడ్పాడును ఎంతో గర్వంగా చెబుతున్నారు.

బొమ్మలు ఇలా ఎంపిక చేసుకుంటారు

            తమిళనాడులో పుట్టి పెరిగిన నాయకులు, సంఘ సంస్కర్తలు, కళాకారులు మొదటి వరుసలో, ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చి తమిళనాడు సంస్కృతికి కృషి చేసిన వారిని రెండు, మూడు విభాగాలుగా విభజించుకుని చంద్రు బొమ్మలు తయారు చేస్తున్నారు.

అధికారిక భవనాలపై

             చంద్రు చేసిన మట్టి బొమ్మలు దేశంలోని అనేక అధికారిక భవనాలపై కొలువుదీరాయి. మద్రాస్‌ హైకోర్టు ప్రాంగణంలో అంబేద్కర్‌ విగ్రహం, మధురై బెంచ్‌, అహ్మదాబాద్‌ హైకోర్టులో గాంధీ విగ్రహం ఆయన చేసినవే.

ఇంకా కలకత్తా బిర్లా మ్యూజియంలో కూడా చంద్రు చేసిన ప్రతిమలు కనిపిస్తాయి. దేశంలోనే కాక జర్మనీ, లండన్‌, యునైటెడ్‌ స్టేట్స్‌, జపాన్‌ మ్యూజియాల్లో కూడా చంద్రు ప్రతిమలు కనిపించడం గర్వకారణం.

‘నేను 2010లో రిటైరయ్యాను. ఆ తరువాత జీవితం గురించి ఏం ఆలోచించలేదు. విద్యార్థిగా, లెక్చరర్‌గా, ఆర్ట్‌ ప్రిన్సిపాల్‌గా మూడు దశాబ్దాలు గొప్ప ప్రయాణం చేశాను. నా విద్యార్థులు చాలా మంది ప్రతిభ గల కళాకారులుగా రాణిస్తున్నారు. ఆ తృప్తి ఉంది. కానీ దాంతోనే ఆగిపోకూడదు. నా కళ నుండి నేను ఎప్పుడూ విరామం తీసుకోకూడదు అనుకున్నాను. అందుకే చెన్నై వంటి మహానగరాన్ని వదిలి ఈ మారుమూల పల్లెకి చేరాను. ఇక్కడైతే శిల్ప కళపై ఎక్కువ సమయం గడపవచ్చు. నా భార్యతో కలిసి ఇక్కడికి ఓ క్యాంపు మీద వచ్చాను. ఇదే నా ప్రయాణానికి సరైన ప్రాంతమని ఇక్కడే స్థిరపడ్డాను’ అని తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు చంద్రు.

ఈ శిల్పకళలను నేర్చుకునేందుకు ఇప్పటికీ రాష్ట్ర నలుమూలల నుండి చంద్రు దగ్గరికి విద్యార్థులు వస్తున్నారు. ప్రశంసల విషయానికొస్తే, 1993లో న్యూఢిల్లీలో జరిగిన కళామేళ ఉత్సవంలో జాతీయ స్టాల్‌ డిజైనింగ్‌ పోటీలో చంద్రు మొదటి స్థానంలో నిలిచారు. 1996లో జపాన్‌లో జరిగిన ‘సప్పరో స్నో స్క్లప్చర్‌ ఫెస్టివల్‌లో ఆయన నేతృత్వంలోని భారత జట్టు రెండవ బహుమతిని గెలుచుకుంది. అలాగే, 1997లో కొలంబోలో జరిగిన సౌత్‌ ఏషియన్‌ టూరిజం అండ్‌ ట్రేడ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా పెవిలియన్‌ డిజైన్‌లో అతని బృందం మొదటి స్థానంలో నిలిచింది.

➡️