ఉక్కు కోసం 3న మహాపాదయాత్ర

– ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడేళ్లుగా పోరాటం : నర్సింగరావు

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో:వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం మార్చి మూడున ఉదయం ఆరు గంటలకు నగరంలోని కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. ప్రజలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గని సంఘీభావం తెలపాలని కోరారు. ఈ పాదయాత్ర విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన నిర్వహించనున్నట్లు తెలిపారు. జగదాంబ జంక్షన్‌లోని ఎన్‌పిఆర్‌ భవన్‌లో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌తో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ.. ఉక్కు ప్రయివేటీకరణను నిరసిస్తూ ప్రజల మద్దతుతో మూడేళ్లుగా పోరాడుతున్నామన్నారు. దేశంలో బిలారు, బకారో కర్మాగారాల్లో కేంద్రం 35 శాతం వాటాను ప్రయివేటీకరించిందని, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ మూడేళ్లుగా ప్రజలు, కార్మికవర్గ పోరాటం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కార్మికులను అభినందించారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకపోవడం, బ్లాస్ట్‌ ఫర్నేస్‌ -3ని మూసివేయడం వంటివి ఆర్థికంగా నష్టపరిచాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. కేవలం యూనియన్‌ పెట్టుకున్నారన్న అక్కసుతో విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మహారాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (మిమ్స్‌) ఆస్పత్రిలో పనిచేస్తున్న 350 మంది కార్మికులకు యాజమాన్యం బయటకు గెంటేసిందన్నారు. ఈ నెల 29న మిమ్స్‌ కార్మికులు చేసే పోరాటానికి రాష్ట్ర కార్మికవర్గం సంఘీభావం తెలపాలని కోరారు.

➡️