పప్పు లతో పలు ప్రయోజనాలు

Dec 30,2023 10:22 #feature

శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మంచి పోషకాలున్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. శరీరానికి పప్పు దినుసుల ద్వారా తగిన పోషకాలు లభిస్తాయి. శనగలు, మినుములు, రాజ్మా, కందులు, పెసర్ల వంటివాటిలోనూ; చిక్కుడు జాతి గింజల్లోనూ పీచు, ప్రొటీన్లు దండిగా ఉంటాయి. ఆహారంలో అన్ని రకాల పప్పులూ కవరయ్యేలా ఒక వారం పప్పుల ప్రణాళిక రూపొందించుకోవాలి.

శనగపప్పు : శరీరంలో హార్మోన్ల స్థాయిని మెరుగు పరుస్తాయి. ఈ పప్పులో కొవ్వు కూడా తక్కువే. ప్రొటీన్లు అందుతాయి. కార్బొహైడ్రేట్‌, ఫైబర్‌ కూడా పుష్కలంగా లభిస్తాయి.

కాబూలీ శనగలు : వీటిల్లోని పీచు రక్తంలో చక్కెర మోతాదులు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. తరచుగా వీటిని తీసుకుంటే మధుమేహం ముప్పు తగ్గటానికి తోడ్పడతాయి. చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా మంచిదే.

మినపపప్పు : ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. రక్త హీనత సమస్య నుంచి బయట పడేలా చేస్తుంది. ఎముకలకు బలం చేకూర్చుతుంది. మధుమేహరోగులకు చాలా ఆరోగ్యదాయకం.

పెసరపప్పు : జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలకు ఉపశమనం కల్గిస్తుంది. చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది. చాలా ప్రొటీన్లు ఉంటాయి.

మసూర్‌ పప్పు : శరీరంలో రక్తస్థాయిలను అదుపులో ఉంచుతుంది. అతిసార, మలబద్ధకం సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. కంటిచూపు మెరుగుదలకు దోహదమవుతుంది.

రాజ్మా : జ్ఞాపక శక్తిని పెంపొందించే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు వీటిలో అధికంగా ఉంటాయి. క్యాన్సర్‌ను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్ల్జెమర్స్‌ బారిన పడకుండా చూసే థైమీన్‌ కూడా దండిగానే ఉంటాయి.

ఉలవలు : ఇనుము, క్యాల్షియం వంటివి దండిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్‌ గుణాల గల ఫాలీఫెనాల్స్‌ కూడా ఎక్కువే. ఇవి క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. యాంటీబాడీలు, స్వీయ రోగ నిరోధక చర్యల్లో కనిపించే హీమగ్లుటినిన్‌ కూడా వీటిల్లో కనిపిస్తుంది. కొలెస్ట్రాల్‌, కడుపు ఉబ్బరం తగ్గటానికి దోహదపడతాయి.

సోయా బీన్స్‌ : వీటిలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి బాగా తోడ్పతాయి.

➡️