అధికారంలోకి వస్తే మున్సిపాల్టీగా మంగళగిరి : లోకేష్‌

మంగళగిరి: మంగళగిరిని తిరిగి మున్సిపాలిటీ చేస్తామని, పన్నుల భారం తగ్గిస్తామని టిడిపి మంగళగిరి నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి నారా లోకేష్‌ అన్నారు. శనివారం రాత్రి మంగళగిరి పట్టణంలోని కొత్తపేట, 13వ వార్డు ఇస్లంపేటలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. లోకేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంగళగిరి – తాడేపల్లి నగరపాల సంస్థ పరిధిలో పనులు అధికంగా ఉన్నాయని అన్నారు. ఐదేళ్ల జగన్మోహన్‌రెడ్డి పాలనలో మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధికి నిధులు కూడా కేటాయించలేదని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసినప్పుడు చెప్పారని గుర్తు చేశారు. మంగళగిరిలో తన గెలిపిస్తే తిరిగి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నందం అబద్దయ్య, దామర్ల రాజు, పోతినేని శ్రీనివాసరావు, షేక్‌ రియాజ్‌, ఎమ్‌డి ఇబ్రహీం, జనసేన పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, మునగపాటి వెంకట మారుతీరావు, షేక్‌ సుభాని పాల్గొన్నారు.

➡️