అరిసెలు చేసుకుందాం..

Jan 14,2024 07:35 #Food, #Sneha
  • సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంటినిండా బంధువులు, పిల్లలతో సందడిగా ఉంటుంది. వచ్చిన వారికి ప్రతి ఇల్లూ పిండి వంటలతో ఘుమఘుమలాడుతూ స్వాగతం పలుకుతుంది. ఆ వంటల్లో అరిసెలు, చక్రాలు, చెక్కలు, బూందీ తప్పకుండా ఉంటాయి. అయితే ఇవి రుచితో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేసుకుంటే మంచిది. బయట లభించే పిండివంటల కన్నా ఇలా ఇంట్లో తయారుచేసినవి అయితే అందరూ ఇష్టంగా తింటారు. అందుకే వీటిని ఎలా తయారుచేయాలో చూద్దాం. 

 

making of pongal food items

నువ్వుల అరిసెలు

కావలసినవి : బియ్యం – 1/2 కేజీ, బెల్లం – 1/2 కేజీ, నువ్వులు – 50 గ్రా., నెయ్యి – 50 గ్రా. నూనె – సరిపోయినంత

తయారీ : ఇరవై నాలుగ్గంటలు నానబెట్టిన బియ్యంతో తడిపిండి పట్టించి ఆరిపోకుండా నొక్కిపట్టి ఉంచాలి. వెడల్పు పాత్రలో బెల్లం ముదురు పాకం పట్టి నెమ్మదిగా పిండిని కలుపుతూ చలిమిడి తయారు చేయాలి. (ముదురు పాకం వచ్చిందేమో ఒక ప్లేటులో నీరుపోసి దానిలో పాకం కొద్దిగావేస్తే ముద్దవ్వాలి. ఆ ముద్దను ప్లేటుపై వేసినప్పుడు టంగ్‌మనే శబ్దం రావాలి.) చలిమిడి తయారీ మధ్య మధ్యలో నువ్వులు, నెయ్యి కలపాలి. చలిమిడి ఆరిపోకుండా ఉండలు చేసి, అరిసెలుగా వత్తుకుని, నూనెలో వేయించాలి. ముదురు రంగులో వేగిన తర్వాత అరిసెల చెక్కలపై నాలుగైదు అరిసెలు దొంతరగా ఉంచి, నూనె పోయేలా నొక్కాలి. వాటిని మరల విడివిడిగా ఆరనివ్వాలి. ఆరిపోయిన అరిసెలను కొత్త మట్టికుండలో భద్రపరుచుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

making of pongal food items

  మినప చక్రాలు

కావలసినవి : మినపగుళ్లు – 2 గ్లాసులు, బియ్యం – 6 గ్లాసులు, వెన్న – 2 టేబుల్‌ స్పూన్స్‌, కారం – స్పూన్‌, వాము – అర టీ స్పూన్‌, నువ్వులు -స్పూన్‌, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకు సరిపడా.

తయారీ : మినపగుళ్లు, బియ్యాన్ని కలిపి మర ఆడించి, పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి, తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. చక్రాలు వత్తే గిద్దను తీసుకుని దానికి నూనె రాయాలి. తరువాత తగినంత పిండిని ఉంచాలి. కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చక్రాలు వత్తుకోవాలి. ఇవి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చాక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే! రుచిగా ఉండే మినప చక్రాలు రెడీ.

making of pongal food items

కారం బూందీ

కావలసినవి : శనగపిండి -కప్పు, పసుపు – పావు టీ స్పూన్‌, ఉప్పు – కొద్దిగా, నూనె – డీప్‌ ఫ్రై కి సరిపడా, పల్లీలు – 2 టేబుల్‌ స్పూన్స్‌, కరివేపాకు – గుప్పెడు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, కారం – టీ స్పూన్‌, నీళ్లు- తగినన్ని, జీలకర్ర పొడి – టీ స్పూన్‌

తయారీ : ముందుగా ఒక గిన్నెలో శనగ పిండిని, పసుపును, కొద్దిగా వేడి చేసిన నూనెను వేసి తగినన్ని నీళ్లను పోసుకుంటూ మరీ పలుచగా కాకుండా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి బాగా వేడిచేయాలి. చిల్లులు ఉన్న ప్లేట్‌ తీసుకుని దానిలో పిండిని నూనెలో పడేలా బూందీని దూసుకోవాలి. బూందీ వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండి అంతా అయిపోయేవరకూ చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో పల్లీలను, కరివేపాకును కూడా వేసి, వేయించి బూందీలో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కలుపుకోవాలి. అంతే కారం బూందీ రెడీ. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల వరకూ తాజాగా ఉంటుంది.

➡️