హామీ మేరకు పర్మినెంట్‌ చేయండి

Nov 20,2023 23:33 #palnadu district

 

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లాల విలేకర్లు : ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని మున్సిపల్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గుంటూరు, మంగళగిరి, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సోమవారం ఆందోళనలు చేపట్టారు. మంగళగిరిలోని కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో హామీనిచ్చారని, దాని ప్రకారం మున్సిపల్‌ కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు రూ.18500 వేతనం ఇవ్వాలని కోరారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధికి అనుగుణంగా కార్మికులను పెంచాలని డిమాండ్‌ చేశారు. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ధర్నాలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మంగళగిరి పట్టణ అధ్యక్షులు పి.పూర్ణచంద్రరావు, సిఐటియు నాయకులు ఎం.బాలాజీ, కె.దుర్గ, బంగారు జ్యోతి, జి.ఏసుబాబు, ఎం.నరసింహారావు, పి.దుర్గ పాల్గొన్నారు.
గుంటూరులో నగరం గోరంట్లలోని మున్సిపల్‌ కార్మికుల మస్టర్‌ వద్ద నిరసనలో ది గుంటూరు జిల్లా మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ కార్మికులు చేసిన పోరాటాల సందర్భంగా వైసిపి నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారని, తమ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ హామీలను అటక్కెక్కించారని విమర్శించారు. మున్సిపల్‌ కార్మికులందరినీ ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చి ‘ఎంప్లాయీ’ అని నమోదు చేయడంతో వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయాయన్నారు. మరోవైపు ఉద్యోగులకు రావాల్సిన జీత భత్యాలు, ఇతర సౌక్యాలు ఏవీ వీరికి దక్కట్లేదన్నారు. 99.5 శాతం హామీలు అమలు చేశామంటున్న ప్రభుత్వానికి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు గుర్తు లేవా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి కె.శివయ్య, జిల్లా నాయకులు కాళంగి భాగ్యరాజు, జిఎంసి వెహికల్‌ షెడ్‌ కమిటీ సభ్యులు యేసురాజు, కార్మికులు రామకోటమ్మ, రాంబారు, కారం శివయ్య, లక్ష్మీ, అక్కమ్మ, చెంచయ్య పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసి కమిషనర్‌ ఎం.రామ్మోహనరావుకు వినతిపత్రం ఇచ్చారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుధ్య కార్మికులు పని చేసినా వారిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. రెండేళ్ల నుండి కొబ్బరి నూనె, ఏడాది నుండి చెప్పులు, సబ్బులు, ఇతర రక్షణ పరికరాలు, పనిముట్లు ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. కార్మికులను ఆప్కాస్‌లో చేర్చి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. మృతి చెందిన పారిశుధ్య కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, పిఎఫ్‌ నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ వేతనాలు, వారాంతపు, పండగ సెలవులు అమలు చేయాలని కోరారు. నిరసనలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్‌రాజు, నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరాజు, టి.మల్లయ్య, డి.యోహాను, కార్మికులు వీరకుమార్‌, పి.ఏసు, నరసింహారావు, జాను, ఇశ్రాయేలు, విజయలక్ష్మి, లుదియమ్మ, గురవయ్య పాల్గొన్నారు.
సత్తెనపల్లిలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నాలో సిఐటియు నాయకులు ఎం.జగన్నాథరావు మాట్లాడారు. అనంతరం మున్సిపల్‌ మేనేజర్‌ సాంబశివరావుకు వినతిపత్రం ఇచ్చారు. యూనియన్‌ అధ్యక్షులు సిహెచ్‌.పెదవెంకయ్య, కార్మికులు పి.నాగేంద్రం, మల్లేశ్వరి, వై.కోటేశ్వరమ్మ, జి.వెంకాయమ్మ, జి.విజయ, ఎం.సత్యవతి, జి.దుర్గా పాల్గొన్నారు. మాచర్ల మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసి కమిషనర్‌ ఇవి రమణబాబుకు వినతిపత్రం ఇచ్చారు. సిఐటియు డివిజన్‌ కార్యదర్శి బి.మహేష్‌ మాట్లాడుతూ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ విభాగాల్లో 20-25 ఏళ్లుగా అనేకమంది నామమాత్రపు వేతనాలతో పని చేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రతా లేదని అన్నారు. 10,117 మందిని పర్మినెంట్‌ చేస్తున్నట్లు గత నెల 21న విడుదల చేసిన జీవో 114లో ప్రభుత్వం పేర్కొన్నా వారిలో ఒక్క మున్సిపల్‌ ఉద్యోగి కూడా లేకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు రమణ, ఇసాక్‌, మరియమ్మ, సాగర్‌బాబు, యు.రమణ పాల్గొన్నారు.

➡️