వైసిపిలో పెనుమార్పులు

Dec 12,2023 10:03 #Alla Ramakrishna Reddy, #MLA, #YCP
  • 11 మందికి స్థానచలనం
  • మంత్రులు మేరుగ, రజిని, ఆదిమూలపు నియోజకవర్గాల మార్పు
  • త్వరలో 54 చోట్ల మార్పులు చేర్పులు
  • పార్టీకి, పదవికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కె రాజీనామా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసిపి పార్టీలో మార్పులు చేర్పులను ప్రారంభించింది. గెలుపు గుర్రాలకు సీట్లు ఇవ్వాలని, అసంతృప్తులను పక్కనబెట్టే విధంగా చకచకా పావులు కదుపుతోంది. ఇటీవల వరకూ సమీక్షలతో సరిపెట్టిన సిఎం తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ఓటమి తరువాత ముందు చర్యలు ప్రారంభించారు. తొలివిడతలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జులను నియమించారు. ముగ్గురు మంత్రులకూ స్థానచలనం కల్పించారు. ఒకటీ రెండు రోజుల్లో ఉభయగోదావరి, తరువాత రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల వారీ ఇన్‌ఛార్జుల మార్పులను ప్రకటించనున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటి వరకూ పార్టీలో పనిచేసిన పలువురు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పార్టీ కష్టకాలంలో నమ్మి పనిచేసిన తమను ఇప్పుడు నమ్మలేకపోవడం ఏమిటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై పోటీచేసి గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఇంకో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉండటంతో రాజీనామాను ఆమోదించరని తెలిసింది. దీనిపై ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్‌కె ముక్కుసూటి మనిషని అందుకనే రాజీనామా చేశారని తెలిపారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మేరుగ నాగార్జునను సంతనూతలపాడు ఇన్‌ఛార్జిగా నియమించారు. చిలకలూరిపేట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి విడదల రజినిని గుంటూరు పశ్చిమకు, ఎర్రగొండపాలెం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొండెపి నియోజకవర్గానికి మార్చారు. కొత్తగా ఇన్‌ఛార్జులను నియమించిన వాటిల్లో ఐదు ఎస్‌సి రిజర్వుడు నియోజకవర్గాలే ఉన్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మేకతోటి సుచరితను తాడికొండ ఇన్‌ఛార్జిగా నియమించి ప్రత్తిపాడుకు బాలసాని కిరణ్‌కుమార్‌ను నియమించారు. కొండెపి ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబును వేమూరుకు పంపించారు. చిలకలూరిపేటకు మల్లెల రాజేష్‌నాయుడు, అద్దంకి పాణెం హనిమిరెడ్డి, మంగళగిరికి గంజి చిరంజీవిని, రేపల్లెకు డాక్టర్‌ ఈపూరు గణేష్‌ను నియమించారు. గాజువాకకు వరికూటి రామచంద్రరావును నియమించారు. దాంతో అక్కడి ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి తనయుడు దేవన్‌రెడ్డి రాజీనామా చేశారు. మంగళగిరి నియోజవకర్గానికి బిసి అభ్యర్థిని నియమించాలనే ఉద్దేశంతోనే గంజి చిరంజీవిని పార్టీ అధిష్టానం ప్రకటించింది. అలాగే చిలకలూరిపేటలో విడదల రజిని మీద వ్యతిరేకత ఉండటంతో ఆమెను అక్కడ నుండి తొలగించి గుంటూరు పశ్చిమకు పంపించారని సమాచారం. కొండెపి ఎస్‌సి రిజర్వుడు నియోజకవర్గంలో గ్రూపులు ఏర్పడడంతో అక్కడ ఆదిమూలపు సురేష్‌ను నియమించారు. అక్కడ నుండి వరికూటి అశోక్‌బాబును తీసుకొచ్చి వేమూరులో నియమించారు. వేమూరులో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న నాగార్జునను సంతనూతలపాడులో నియమించారు. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న టిజెఆర్‌ సుధాకర్‌బాబుకు సీటు కేటాయింపు అనుమానమేనంటున్నారు. అలాగే గుంటూరు పశ్చిమ నుండి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన మద్దాలి గిరిధరరావుకు సీటు కేటాయింపు లేదు. ఎమ్మెల్సీ ఇవ్వొచ్చని ప్రచారం. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయిన డొక్కా మాణిక్య వరప్రసాదరావును తాడికొండ ఇన్‌ఛార్జిగా నియమించారు. ఇప్పుడు అతన్ని తొలగించి ఊహించని విధంగా మేకతోటి సుచరితను నియమించారు. ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 54 మంది ఎమ్మెల్యేలకు స్థానచలనం ఉందని తెలిసింది. ఒకటీ రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. అలాగే కృష్ణా జిల్లా ప్రజా ప్రతినిధులు, ఇన్‌ ఛార్జులతో సిఎం సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. అయితే ఆర్‌కె రాజీనామాపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పందించారు. ఆయన రాజీనామా పత్రం ఫార్మాట్‌ చూసిన తరువాత నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

➡️